Arvind Kejriwal: కేజ్రీవాల్‌ ఇంటికి అంబులెన్స్‌ పంపిన భాజపా నేత

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు బెయిల్‌ పొడిగించాలని సుప్రీంను అభ్యర్థించిన నేపథ్యంలో భాజపా నేత, సీఎం ఇంటికి అంబులెన్స్‌ పంపడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది.

Published : 01 Jun 2024 17:33 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇంటికి భాజపా సీనియర్‌ నేత విజయ్ గోయెల్ (Vijay Goel)  శనివారం అంబులెన్స్‌ (ambulance)ను పంపారు. కేజ్రీవాల్‌ తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నందున వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ పొడిగించమని సుప్రీంను కోరిన నేపథ్యంలో విజయ్ గోయెల్ ఈవిధంగా స్పందించారు. కాగా సీఎం భద్రతా బలగాలు ఆ అంబులెన్సును అడ్డుకున్నాయి.  

దీనిపై విజయ్‌ గోయల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కేజ్రీవాల్ అనారోగ్య సమస్యల పేరుతో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఈ అంబులెన్స్ కేజ్రీవాల్‌ను ఏ ఆసుపత్రికైనా వెంటనే తీసుకెళ్తుంది. ఇందులో వెళ్తే ఆయనకు చేయాల్సిన పరీక్షలన్నీ రెండు గంటల్లో పూర్తవుతాయి. ముఖ్యమంత్రి నాటకాలు మానేసి నాతో వైద్య పరీక్షలకు రావాలి’’ అని ఆయన విలేకరులతో అన్నారు.

వైద్య పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ దిల్లీ సీఎం వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ బుధవారం నిరాకరించింది. 

దిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేసేందుకు వీలుగా మే 10న అత్యున్నత న్యాయస్థానం 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. పీఈటీ-సీటీ స్కాన్‌తో సహా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన నేపథ్యంలో తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ మే 26న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైలులో తాను 7 కిలోల బరువు తగ్గానని,  కీటోన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని తన అభ్యర్ధనలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని