Lok Sabha polls: అభ్యర్థులపై భాజపా మేధోమథనం.. 2019లో గెలవని స్థానాలు తొలి జాబితాలోనే!

లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోన్న భాజపా.. అనేక రాష్ట్రాల నేతలతో బుధవారం మేధోమథనం జరిపింది.

Published : 28 Feb 2024 18:33 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో భాజపా నిమగ్నమైంది. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల నేతలతో బుధవారం మేధోమథనం చేసింది. తొలి జాబితాలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సమావేశం కానున్న ముందురోజే ఈ సమావేశాలు నిర్వహించడం గమనార్హం.

అనేక రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటుచేశారు. మధ్యప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ నేతలతో భేటీ అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతోనూ ఈ తరహా భేటీలు జరిగాయి.

తొలి జాబితాలోనే ఆ స్థానాలు..

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌ షా వంటి ముఖ్య నాయకుల పేర్లు ఇందులో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితోపాటు 2019 ఎన్నికల్లో భాజపా గెలవని స్థానాలను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారని సమాచారం.

2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన తొలి జాబితాలోనూ మోదీ, షా పేర్లు ఉన్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాతే భాజపా అభ్యర్థుల జాబితా ప్రకటించింది. కానీ, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాల్లో విజయం సాధించాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని