UP Local Body Election: యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా హవా

యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా భాజపాకు అనుకూలంగా వెలువడుతున్నాయి. మొత్తం 17 మేయర్‌ స్థానాల్లో నాలుగు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. మిగిలిన చోట్ల ముందంజలో ఉన్నారు. 

Published : 13 May 2023 17:47 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌ (UP)స్థానిక సంస్థల ఎన్నిక( Local Body Election)ల్లో అధికార భారతీయ జనతాపార్టీ (BJP)హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 17 మున్సిపల్‌ కార్పొరేషన్లలో భాజపా ఆధిక్యం కొనసాగుతోంది. లఖ్‌నవూ, మధుర, బరేలీ, మొరదాబాద్‌, సహరన్‌పుర్‌ మేయర్‌ స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకొంది. ప్రయాగ్‌రాజ్‌, వారణాశిలో ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 19 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. 1,401 మంది కార్పొరేటర్ల ఎన్నిక కోసం ఓటింగ్‌ జరిగింది.  ఇక మొత్తం 199 మున్సిపల్‌ కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికల్లో 97 స్థానాలు బీజేపీ .. సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు, కాంగ్రెస్‌ 4 చోట్ల, బీఎస్పీ 19 స్థానాల్లో ఇతరులు 42 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలోని 544 నగర పంచాయతీల్లో 195 చోట్ల భాజపా, 80 స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్‌ 7, బీఎస్పీ 42, ఇతరులు 169 చోట్ల ముందంజలో ఉన్నారు.

ఈ ఎన్నికల కోసం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 13 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాదాపు 50కిపైగా బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. మొత్తం రెండు విడతల్లో ఆయన ప్రచారం జరిగింది. తమ ప్రభుత్వం నేరగాళ్లు, మాఫియా విషయంలో ఎంత కఠినంగా ఉంటోందో యోగి ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ కానీ ప్రచారానికి రాలేదు. వారు స్థానిక నాయకత్వాలకే ప్రచార బాధ్యతలు అప్పగించారు.  లోక్‌సభ ఎన్నికలకు ముందు అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలా కీలకం.

మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని స్వార్‌, ఛంబీ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా భాజపా మద్దతుతో అప్నాదళ్‌  (ఎస్‌) అభ్యర్థులు విజయం సాధించారు. స్వార్‌ నుంచి అహ్మద్‌ అన్సారీ, ఛంబీ నుంచి రింకీ కోల్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని