Exit polls: జాతీయ స్థాయిలో ఎగ్జిట్‌ పోల్స్‌ బోల్తా.. ఎక్కడ తేడా కొట్టింది?

Exit polls: జాతీయ స్థాయిలో ఎగ్జిట్‌ పోల్స్‌ బోల్తా కొట్టాయి. ఎన్డీయే కూటమికి 350 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది.

Published : 04 Jun 2024 21:07 IST

Exit polls | ఇంటర్నెట్‌ డెస్క్‌: మరోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేనే కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit polls) అంచనా వేశాయి. భాజపాకు సొంతంగా 300 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. ఇండియా కూటమికి 200 సీట్లు రావడం కష్టమేనని పేర్కొన్నాయి. కానీ, ఎగ్జిట్‌ పోల్స్‌ వేసిన అంచనాలు.. వాస్తవంలో గతి తప్పాయి. ఎన్డీయే కూటమి మెజారిటీ మార్కు దాటినా.. ఇండియా కూటమి మాత్రం అంచనాలను మించి రాణించింది. దాని ఫలితం దలాల్‌ స్ట్రీట్‌లో స్పష్టంగా కనిపించింది. సుమారు 30 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 350 సీట్లకు తక్కువ రావని ప్రముఖ ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit polls) అంచనా వేశాయి. ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా, ఏబీపీ- సీ ఓటర్‌, టుడేస్‌ చాణక్య, రిపబ్లిక్‌-పీమార్క్‌ వంటి ప్రముఖ సర్వేలన్నీ ఎన్డీయేకు బంపర్‌ మెజారిటీ అంటూ అంచనా వేశాయి. అందుకు భిన్నంగా ఎన్డీయే కూటమి 300 సీట్లలోపే పరిమితమైంది. ఇండియా కూటమి 230కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 19 స్థానాల్లో సత్తా చాటారు.

ఎక్కడ తేడా కొట్టింది...?

2019 ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో భాజపా విజయం సాధించింది. ఈసారి కూడా ఆ పార్టీ అదే స్థాయిలో రాణిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ బలపడనుందని జోస్యం చెప్పాయి. ఒడిశాలో పుంజుకోవడంతో పాటు తమిళనాడు, కేరళలోనూ బోణీ కొడుతుందని అంచనా వేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ తగిలింది. 80 స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 36 స్థానాలు రాగా.. ఇండియా కూటమి 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 18 స్థానాలు రాగా.. ఇండియా కూటమికి 29 స్థానాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో గతంలో 18 స్థానాలు రాగా.. ఈ సారి ఆరు తగ్గాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ దాదాపు 30 స్థానాల్లో సత్తా చాటింది. దీంతో భాజపా అంచనాలు తలకిందులయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు