Sreenivasa Prasad: కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూత

Sreenivasa Prasad: చామరాజనగర్‌ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూశారు. వాజ్‌పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు.

Published : 29 Apr 2024 08:28 IST

బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

చామరాజనగర్‌ నుంచి శ్రీనివాస ప్రసాద్‌ ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. మైసూర్‌ జిల్లాలోని నంజన్‌గుడ్‌ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు గత నెల 18నే ప్రకటించారు. 1976లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1979లో కాంగ్రెస్‌లో చేరారు. భాజపాలో చేరడానికి ముందు కొన్నాళ్లు జేడీఎస్‌, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న 1999-2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి భాజపాలో చేరారు. 2017లో నంజన్‌గుడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2019లో చామరాజనగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని