BJP: ఐశ్వర్యరాయ్‌ పేరు ప్రస్తావించిన రాహుల్.. తీవ్ర విమర్శలు చేసిన భాజపా

నటి ఐశ్వర్యరాయ్‌(Aishwarya Rai) పేరు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశం గర్వించదగ్గ ఆమెను కించపర్చేలా మాట్లాడటం తగదని భాజపా హితవు పలికింది.

Updated : 22 Feb 2024 12:39 IST

దిల్లీ: బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌(Aishwarya Rai)ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భాజపా(BJP) విరుచుకుపడింది. ఆయన తన ప్రవర్తనతో మరింత దిగజారిపోయారంటూ మండిపడింది. ‘వరుస ఓటములతో రాహుల్‌ గాంధీ తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకే దేశం గర్వించే ఐశ్వర్యరాయ్‌ను కించపరిచే స్థాయికి దిగజారారు. ఎలాంటి ఘనతలు సాధించని రాహుల్‌.. గాంధీ కుటుంబానికి మించి దేశానికి కీర్తి సంపాదించిన పెట్టిన ఐశ్వర్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సిద్ధరామయ్యజీ(కర్ణాటక సీఎం).. మీ బాస్ మీ తోటి కన్నడిగులను అవమానిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా..? లేక మీ కుర్చీ కోసం మౌనంగా ఉండిపోతారా..?’ అని కర్ణాటక భాజపా ఎక్స్‌(ట్విటర్)వేదికగా దుయ్యబట్టింది.

రాహుల్‌ గాంధీ ప్రస్తుతం భారత్‌ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గత నెల అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్ఠ గురించి మాట్లాడుతూ..‘మీరు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూశారా..? అక్కడ ఓబీసీ వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి అయినా కనిపించారా..? అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, నరేంద్రమోదీ వంటివారు మాత్రమే ఉన్నారు’ అని భాజపాపై విమర్శలు చేశారు. బిలియనీర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే,  మహత్కార్యంలో అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌ మాత్రమే పాల్గొన్నారు. ఐశ్వర్య హాజరుకాలేదు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో ఐశ్వర్య పేరు ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన ప్రసంగాలను కొన్నింటిని భాజపా పోస్టు చేసింది. ‘టీవీ ఛానెళ్లు ఐశ్వర్య నృత్యాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. పేదప్రజల స్థితిగతుల గురించి ఎలాంటి ప్రసారాలు చేయడం లేదు’ అని ఓ ప్రసంగంలో ఆరోపించారు. ఈ మాటలను ప్రముఖ సింగర్‌ సోనా మహాపాత్ర తీవ్రంగా ఖండించారు. ఆమె అద్భుతంగా నృత్యం చేస్తారని, తమ ప్రయోజనాల కోసం నేతలు ఇతరులను కించపర్చడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని