Dilip Ghosh: దిలీప్ ఘోష్‌కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎంపీ దిలీప్ ఘోష్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు.

Updated : 27 Mar 2024 16:29 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై ఎంపీ దిలీప్ ఘోష్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘‘గౌరవనీయులైన దిలీప్‌ ఘోష్‌ మీరు చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి. ఇటువంటి అన్‌పార్లమెంటరీ విధానాలకు భాజపా విరుద్ధం. మీ వ్యాఖ్యలను పార్టీ ఖండిస్తోంది. వీలైనంత త్వరగా మీ ప్రవర్తనకు గల కారణాలను పార్టీకి వివరించాలి’’ అని భాజపా అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. 

దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. నోటీసులకు లేఖ ద్వారా అధికారికంగా సమాధానం ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం బర్దమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

దుర్గాపూర్‌లో దిలీప్‌ఘోష్‌ విలేకరులతో మాట్లాడుతూ “బంగ్లా నిజేర్ మేయే కే చాయ్ (బెంగాల్‌కు సొంత కూతురే కావాలి) అని మమత చేసిన నినాదాన్ని ఎగతాళి చేశారు. దీదీ గోవాకు వెళ్లినప్పుడు తాను గోవా కూతురినని చెబుతుంటారు. త్రిపురలో త్రిపుర కుమార్తెనంటుంటారు. మమత ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర కుమార్తెగా చెప్పుకుంటుంటారు. ముందు ఆమె తన తండ్రి ఎవరో స్పష్టం చేయాలి’’ అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సందర్భంలో ఓ ముఖ్యమంత్రి గౌరవానికి, మర్యాదకు భంగం కలిగించేలా మాట్లాడి భాజపా ఎంపీ కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. వారి వ్యాఖ్యలు మహిళలపై ద్వేషం, అగౌరవభావం పెంచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.  

ఇటువంటి భాజపా నాయకుల మనస్తత్వం నారీ శక్తిని అవమానపరుస్తుంది. బెంగాల్ మహిళలపై ఘోష్‌కు గౌరవం లేదు. గతంలోను ఆయన మా దుర్గపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ గురించి ఇలా మాట్లాడినందుకు అతడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలి అని టీఎంసీ ఎన్నికల కమిషన్‌ను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని