Supriya Shrinate: మొన్న కంగనపై.. నేడు ఎన్‌కౌంటర్‌పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్‌

కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. 

Updated : 18 Apr 2024 15:26 IST

దిల్లీ: కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్‌ (Supriya Shrinate) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ (Chhattisgarh Encounter)లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆమె మాట్లాడినట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దానిలో ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఎన్‌కౌంటర్‌పై హస్తం పార్టీ జాతీయ అధికారిక ప్రతినిధి సుప్రియ స్పందిస్తూ.. మృతిచెందిన మావోయిస్టులను అమరవీరులుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై భాజపా ఛత్తీస్‌గఢ్‌ విభాగం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ఛత్తీస్‌గఢ్‌ నేలను రక్తంతో తడిపిన నక్సలైట్లను అమరవీరులు అని పిలిచి ఈ రాష్ట్ర ప్రజలు, పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని ఆమె అపహాస్యం చేస్తున్నారు’’ అని మండిపడింది. ఇదిలాఉంటే.. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన ఈ ఎన్‌కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. ‘‘శాంతి, అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్‌కి నక్సలిజం అతిపెద్ద శత్రువు. దాన్నుంచి దేశానికి విముక్తి కల్పించాలని నిర్ణయించుకున్నాం’’ అని దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించిన సంగతి తెలిసిందే.

ఇటీవల కూడా సుప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిమాచ్‌ప్రదేశ్‌లోని మండి భాజపా (BJP) అభ్యర్థిగా పోటీ చేయనున్న కంగనా రనౌత్‌కు సంబంధించి సుప్రియా పెట్టిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట దుమారం రేపింది. దాంతో ముందుజాగ్రత్త చర్యగా లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్‌ ఆమెను పక్కనపెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమెకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని