Parshottam Rupala: దారితప్పిన పడవ.. అందులో కేంద్రమంత్రి!

Parshottam Rupala: ఖోర్ధా జిల్లాలోని బర్కుల్‌ నుంచి పూరీలోని సాత్‌పాడాకు బయలుదేరిన సమయంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణిస్తున్న పడవ రెండు గంటల పాటు సరస్సులో చిక్కుకుపోయింది.

Updated : 09 Jan 2024 08:15 IST

భువనేశ్వర్‌: కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణిస్తున్న పడవ ఒడిశా (Odisha)లోని చిలికా సరస్సులో దాదాపు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. తొలుత మత్స్యకారుల వల అడ్డుపడి ఉంటుందని భావించారు. తాము దారితప్పామని రూపాలా తర్వాత వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా కూడా ఆయనతో ఉన్నారు.

అధికారులు అప్రమత్తమై వెంటనే మరో పడవను పంపి రూపాలా సహా ఆయనతో ఉన్న బృందాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఖోర్ధా జిల్లాలోని బర్కుల్‌ నుంచి పూరీలోని సాత్‌పాడాకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. పడవ నడిపే వ్యక్తికి ఆ మార్గం కొత్తని.. చీకటి పడటంతో అతను దారి గుర్తించలేకపోయాడని భద్రతాధికారి తెలిపారు.

11వ విడత ‘సాగర్‌ పరిక్రమ’ పథకంలో భాగంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాలా ఒడిశా (Odisha)లో మత్స్యకారులతో సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం కూడా ఆయన మత్స్యకారులతో భేటీ కావాల్సి ఉంది. ఆలస్యం కావటంతో కార్యక్రమం రద్దయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని