కేంద్రమంత్రి నివాసంలో మృతదేహం కలకలం.. తనయుడిపైనే అనుమానం

కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్‌ ఇంట్లో శుక్రవారం ఉదయం అనుమానాస్పద రీతిలో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. మంత్రి తనయుడే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated : 01 Sep 2023 12:28 IST

లఖ్‌నవూ: కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్(Union Minister Kaushal Kishore) నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కేంద్రమంత్రి తనయుడే ఆ యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవ అని పోలీసులు వెల్లడించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని ఆ కథనాలు పేర్కొన్నాయి.

ఆ తుపాకీ నా కుమారుడిదే కానీ.. మీడియాతో కేంద్రమంత్రి

తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతదేహం లభ్యం కావడం, ఆ తుపాకీ తన కుమారుడు వికాస్‌ కిశోర్‌దేనంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి స్పందించారు. ‘పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ తుపాకీ నా కుమారుడు వికాస్‌ కిశోర్‌దే. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన జరిగినప్పుడు నా కుమారుడు ఇంట్లో లేడు. అతడి స్నేహితులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టకూడదు. ఈ మృతి వార్త విని, వికాస్ ఎంతో బాధపడుతున్నాడు. మృతుడు వికాస్‌కు మంచి స్నేహితుడు’ అని మంత్రి మీడియాకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని