RBI: ‘11 ప్రాంతాల్లో బాంబులు పెట్టాం’.. ఆర్‌బీఐకి బెదిరింపులు

Bomb Threat to RBI: ఆర్‌బీఐకి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published : 26 Dec 2023 17:47 IST

ముంబయి: నూతన సంవత్సరం వేడుకలకు ముందు దేశ వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సారి ఏకంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)ను టార్గెట్‌ చేస్తూ దుండగులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

ఆర్‌బీఐ (RBI)కి చెందిన ఓ మెయిల్‌ ఐడీకి మంగళవారం ఉదయం ఈ బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ముంబయిలోని ఆర్‌బీఐ ఆఫీసులు సహా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌.. ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు అందులో పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ బెదిరింపు మెయిల్‌ పంపించారు.

‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’

దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ‘ఖిలాఫత్‌. ఇండియా’ అనే పేరున్న మెయిల్‌ ఐడీ నుంచి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని