Rajnath Singh: ‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’

ఇటీవల వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

Updated : 26 Dec 2023 16:21 IST

ముంబయి: భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకల (Merchant Ships)పై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) తెలిపారు. నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులకు పాల్పడిన వారు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ (INS Imphal)’ను ముంబయి వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈమేరకు మాట్లాడారు.

ఎంవీ కెమ్‌ ప్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్‌ దాడి నిజమే: భారత నేవీ

గుజరాత్‌ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్‌ వెల్లడించింది. అయితే, అమెరికా ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. అంతకుముందు ‘ఎంవీ సాయిబాబా’పైనా దాడి జరిగింది. ఈ పరిణామాల నడుమ భారత హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని