Pradeep Sharma: 100 మందికిపైగా గ్యాంగ్‌స్టర్లను కాల్చి, ఓటీటీ సిరీస్‌లో నటించి,.. చివరకు దోషిగా మిగిలి

ముంబయి(Mumbai)లో గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించిన ఓ పోలీసు అధికారికి బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది.

Published : 20 Mar 2024 14:13 IST

ముంబయి: నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసు(Lakhan Bhaiya encounter case)లో మహారాష్ట్రకు చెందిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్‌శర్మ(Pradeep Sharma)కు జీవితఖైదు పడింది. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ చోటారాజన్‌ అనుచరుడు రామ్‌నారాయణ్‌ గుప్తాను ప్రదీప్‌ కాల్చి చంపిన కేసులో ఆయనకు ఈ శిక్ష ఖరారుచేశారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా వందమందికి పైగా గ్యాంగ్‌స్టర్లను మట్టుపెట్టి, ఇప్పుడు దోషిగా మిగిలారు. ఇంతకీ ఎవరీ ప్రదీప్‌ శర్మ..?

ప్రదీప్‌ శర్మ(Pradeep Sharma).. 1983లో పోలీసు ఉద్యోగంలో చేరారు. ముంబయి అండర్‌వర్డల్ డాన్ చోటా రాజన్‌, ఇతర గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించారు. ఒకే ఏడాదిలో రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ సాదిఖ్ కాలియాను ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారు. 2003లో లష్కరేతొయిబా అనుమానితులను శర్మ బృందం మట్టుపెట్టింది. అయితే అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2008లో విధుల నుంచి తొలగించారు. అయితే 2009లో తిరిగి బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 2010లో ఆయన్ను అరెస్టు చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌లో రామ్‌నారాయణ్‌ గుప్తా అలియాస్‌ లఖన్‌ భయ్యా మృతి చెందాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నాలుగు సంవత్సరాల శిక్ష అనంతరం 2013లో బయటకు వచ్చారు. 2019లో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.. ఆ వెంటనే శివసేనలో చేరారు. తర్వాత ఆ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమి చవిచూశారు.

ఇదిలా ఉండగా.. మూడేళ్ల క్రితం దక్షిణ ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపాన పేలుడు పదార్థాల వాహనాన్ని గుర్తించిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ వాహన యజమానిగా చెబుతున్న హిరేన్ మన్‌సుఖ్ శవమై కనిపించారు. ఈ కేసుల విచారణ సమయంలో ప్రదీప్‌(Pradeep Sharma) పేరు వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించి 2021లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఓటీటీ సిరీస్‌ ‘ముంబయి మాఫియా: పోలీస్‌ వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌’తో 2023లో ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. శర్మ, ఆయన బృందం ముంబయిలో డి-కంపెనీని ఎలా అణచివేసిందో అందులో చూపించారు. అందులో ప్రదీప్ శర్మ పాత్రలో ఆయనే నటించడం విశేషం.

తాజాగా రామ్‌నారాయణ్‌ గుప్తా ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారించిన బాంబే హైకోర్టు.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అలాగే ప్రదీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2013లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా తప్పు పట్టింది. ఇదే కేసుకు సంబంధించి పోలీసు సిబ్బంది సహా 13 మందికి జీవితఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మరో ఆరుగురికి ఆ శిక్షను రద్దు చేసి నిర్దోషులుగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు