Yogi Adityanath: బుల్లెట్.. బుల్‌డోజర్ ప్రభావమెంత..!
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న వేలకొద్దీ ఎన్‌కౌంటర్లపై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. ‘బ్రాండ్ యోగి’ పాలనలో ‘బుల్లెట్, బుల్‌డోజర్’ పాలసీని ఎంత మంది సమర్థిస్తున్నారో.. అంతే మంది విమర్శిస్తున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఎన్‌కౌంటర్ డెత్ నెంబర్ 183 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాఫియాడాన్ అతీక్ కుమారుడు అసద్‌ను ఝాన్సీ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోపే దాదాపు 100కు పైగా కేసుల్లో నిందితులైన అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్ హత్యకు గురయ్యారు. ఫలితంగా ఓ దిగ్గజ మాఫియా సామ్రాజ్యం పునాదులు కదిలిపోయాయి. ఈ పరిణామాలు చోటు చేసుకొన్న మూడు రోజులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ఏ మాఫియాలు ఫోన్లు చేసి పారిశ్రామికవేత్తలను బెదిరించలేవని’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు యూపీలో పరిణామాలు మంచికా.. లేదా చెడుకా అనే చర్చ దేశవ్యాప్తంగా తెరలేచింది.
2017 మార్చి 19వ తేదీన యోగి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. క్రిమినల్స్‌ను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఆయన తొలి ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పారు. ‘గూండా రాజ్యం ముగుస్తుంది. యూపీలో చట్ట ఉల్లంఘనలకు చోటు లేదు’’ అని వెల్లడించారు. యోగి పాలన మొదలుపెట్టే సమయానికి రాష్ట్రంలో నాయకులకు నేరగాళ్లకూ మధ్య విడదీయలేని స్థాయిలో సంబంధాలున్నాయి. ఫలితంగా నేరగాళ్లను అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.
యోగి పాలన మొదలై పక్షం రోజుల తర్వాత తొలి ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది. మార్చి 31న షహరాన్‌పూర్ పరిధిలోని నందన్‌పుర్ వద్ద గుర్మిత్ అనే క్రిమినల్‌ను పోలీసులు తొలిసారి కాల్చి చంపారు. ఆ తర్వాత నుంచి మెల్లగా యోగి పాలనలో క్రైమ్ అణచివేత స్టైల్‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈ కఠిన వైఖరి తిరుగులేని ఆయుధంగా మారింది. తొలి పది నెలల్లోనే 1,100 పోలీస్ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొన్నాయి. మేరఠ్, ఆగ్రా, బరేలి, కాన్పూర్ ప్రాంతాల్లో అత్యధికంగా జరిగాయి. నేరగాళ్లు పోలీసులకు లొంగిపోవడమో.. లేదా రాష్ట్రం విడిచి పారిపోవడం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. 2023 ఏప్రిల్ నాటికి ఈ ఎన్‌కౌంటర్ల సంఖ్య 10,900కు చేరింది. 23,300 మంది క్రిమినల్స్‌ను అరెస్టు చేయగా.. 5,046 మంది గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్లలో ముఖ్యంగా నేరగాళ్ల కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపేవారు. 183 మంది నేరగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ‘ఆపరేషన్ లంగ్డా’ పేరిట యూపీ పవర్ సర్కిల్‌లో ఇవి పాపులర్ అయ్యాయి.
ఈ ఎన్‌కౌంటర్లలో పోలీసుల వైపు కూడా గాయపడిన వారి సంఖ్య భారీగానే ఉంది. 1,443 మంది గాయపడగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా వికాస్ దూబే గ్యాంగ్ బిక్రూ గ్రామంలో జరిపిన ఒక దాడిలో ఎనిమిది మంది అధికారులు మరణించారు. ఆ తర్వాత వికాస్‌దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తాపడటం.. అతడి ఎన్‌కౌంటర్ చకచకా జరిగిపోయాయి. ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్‌కు స్వేచ్ఛను ఇవ్వడంతో ఆయన నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
బుల్లెట్, బుల్‌డోజర్‌పై విమర్శలున్నా..
నేరగాళ్లను ఎన్‌కౌంటర్లు చేయడం.. వారి ఇళ్లపై బుల్‌డోజర్లు నడిపించడం యోగి మార్క్ పాలనకు చిహ్నాలుగా మారిపోయాయి. కానీ, మాస్‌లో ఇటువంటి చర్యలకు క్రేజ్ ఉండటంతో.. ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. వీటి కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగైనట్లు నమ్మేవారి సంఖ్య గణనీయంగా ఉండటంతో యోగి 2.0కు ప్రజలు ఆమోదముద్ర వేశారు. మరోవైపు యూపీలో పెట్టుబడులకు నేరగాళ్లు ప్రధాన అడ్డంకిగా మారారని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రాన్ని 2027 నాటి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో నేరగాళ్లపై ఉక్కుపాదం తప్పదని చెబుతోంది.
చట్టాలంటే భయం పెరిగిందా..
వేల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరుగుతుంటే మరో వైపు నేరగాళ్లలో భయం మొదలైందనడం ప్రశ్నార్థకమే. ఇటీవల జరిగిన ఉమేశ్‌పాల్, అతీక్ సోదరుల హత్యలే దీనికి పెద్ద నిదర్శనం. ఈ హత్యలు జరిగే సమయంలో వారు సాయుధ బలగాల రక్షణలో ఉన్నారు. ఉమేశ్ వద్ద ఇద్దరు గన్‌మెన్‌లు ఉండగా.. అతీక్ సోదరులకు రక్షణగా 17 మంది పోలీసులు ఉన్నారు. అయినా హంతకులు పోలీసులను లెక్కచేయకుండా హత్యలు చేశారు. అతీక్ పరిణామాలు చోటు చేసుకొంటున్న సమయంలో ఆ రాష్ట్రంలోని జలౌన్ అనే ప్రాంతంలో రాజ్ అహిర్‌వార్ అనే యువకుడు రోష్నీ అనే డిగ్రీ విద్యార్థినిని నడిరోడ్డుపై తుపాకీతో కాల్చిచంపాడు.
- వాస్తవంగా వ్యవస్థీకృత నేరాలను అణచివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. తుపాకీ వినియోగించి చేసే నేరాల సంఖ్య 2017 తర్వాత నుంచి నిలకడగా పెరుగుతోందని ఆంగ్లపత్రిక ‘ది ప్రింట్’ కథనం వెల్లడించింది. ఆర్మ్స్ యాక్ట్ - 1959 కింద నమోదయ్యే నేరాల సంఖ్య యూపీలోని ప్రతి లక్షమంది జనాభాకు 15.7గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. ఈ రాష్ట్రంలో 2021లో మొత్తం 36,363 కేసులు నమోదయ్యాయి.
- గ్యాంగ్‌వార్ హత్యలు కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో పెరిగాయి. 2021లో గ్యాంగ్ వార్ కారణంగా హత్యచేసినట్లు అంగీకరించిన కేసులు 65 నమోదుకాగా.. వాటిల్లో 42 కేసులు యూపీలోనే ఉన్నాయి. ఇటువంటి కేసుల సంఖ్య 2017లో దేశవ్యాప్తంగా 74 నమోదైతే.. యూపీలో కేవలం 27 మాత్రం జరిగాయి.
సాధారణ నేరాల్లో తగ్గుదల..
ముఖ్యంగా కిడ్నాప్‌లు, అపహరణల వంటి నేరాల సంఖ్య యూపీలో గణనీయంగా తగ్గింది. జాతీయ సగటు 7కుపైగా ఉండగా.. యూపీలో 6.3శాతంగా నమోదైంది. 2016-18 మధ్యలో ఇక్కడ కిడ్నాప్‌లు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా జరిగాయి.
అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు వంటి నేరాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2016లో ప్రతి లక్ష మంది జనాభాలో ఇటువంటి నేరాలు 30 నమోదయ్యాయి. వాటి సంఖ్య 2021 నాటికి 22.7కు చేరింది. 2021లో ఈ నేరాల జాతీయ సగటు 30.2గా ఉంది.
తప్పుదోవపడితేనే ప్రమాదం..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను పోలీసులు దుర్వినియోగం చేసే ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. యోగి ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపు పదోన్నతి కోసం ఓ ఎస్‌ఐ నోయిడాలోని జిమ్ ట్రైనర్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు 2021 సెప్టెంబరులో పోలీసులు రైడ్ పేరిట గోరఖ్‌పూర్‌లోని ఓ హోటల్‌పై దాడి చేశారు. అక్కడ మనీష్ గుప్తా అనే వ్యాపారిని అతడి కుటుంబం ఎదుటే తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో అతడి కుటుంబ సభ్యులు పోలీసులపై ధైర్యంగా పోరాడి కేసులు నమోదు చేయించారు. దీంతో ఆరుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై యూపీ పాలకులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
1990ల్లో మహారాష్ట్రలోని ముంబయిలో అండర్‌వరల్డ్ రాజ్యమేలేది. అప్పట్లో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఎన్‌కౌంటర్లను మార్గంగా ఎన్నుకోవడంతో దయానాయక్, ప్రదీప్ శర్మ, విజయ్ సాలస్కర్, సచిన్ వాజే, రవీంద్ర నాథ్ ఆంగ్రే వంటి పోలీసు అధికారులు పాపులర్ అయ్యారు. మాఫియా అదుపులోకి వచ్చినా.. ఈ పోలీసుల్లో సచిన్ వాజే తన పాపులారిటీని వాడుకొని సెటిల్మెంట్లు, హత్యలు చేసి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఏకంగా ముఖేశ్ అంబానీనే బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. దీనికి తోడు అతడు అధికారంలో ఉన్నవారికి చీకటి కార్యకలాపాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. చివరికి కటకటాల పాలై పోలీసుల పరువు తీశాడు. పోలీసులకు తిరుగులేని అధికారాలను ఇస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాలను ఈ ఘటనలు చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్ అనేది రెండు వైపులా పదునున్న కత్తివంటిది.. ఇష్టారాజ్యంగా దానిని వాడితే ఒక్కోసమయంలో ఉపయోగించిన వారే గాయపడే పరిస్థితి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన