Bride Chase: పారిపోయిన వరుడు.. వెంటాడి పట్టుకొచ్చిన వధువు!

పెళ్లి నుంచి తప్పించుకు పారిపోతున్న వరుడిని వెంబడించి పట్టుకుందో వధువు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

Published : 24 May 2023 02:01 IST

లఖ్‌నవూ: ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా వివాహ ముహూర్తం సమీపిస్తోన్న వేళ వరుడు పరారయ్యాడు. అయితే, వధువు మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. 20 కిలోమీటర్ల వరకు వెంటాడి (Bride Chase Groom) అతన్ని తిరిగి మండపానికి తీసుకొచ్చింది. అనంతరం ఇద్దరి వివాహం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ యువకుడు, యువతి రెండున్నరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ తేదీ నిర్ణయించారు. బరేలీ (Bareilly)లోని ఓ ఆలయంలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

అయితే, ముహూర్తం దాటిపోతున్నప్పటికీ.. ఎంతకు పెళ్లికుమారుడి జాడ లేకుండా పోయింది. అప్పటికే ముస్తాబయి కూర్చున్న పెళ్లి కుమార్తె విసిగిపోయి.. చివరకు అతనికి ఫోన్‌ చేసింది. తన తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్లు అతను చెప్పాడు. అయితే, పెళ్లి నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నాడని గ్రహించిన ఆమె, వెంటనే కుటుంబ సభ్యుల సాయంతో అతని కోసం బయల్దేరింది. ఈ క్రమంలోనే బరేలీకి 20 కి.మీ దూరంలో భీమోరా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కుతుండగా అతన్ని వెంబడించి పట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు అతన్ని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చి పెళ్లితంతు ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని