తమ్ముడి మరణం.. అన్నయ్య చెదరని సంకల్పం!

కరోనా విపత్కర పరిస్థితుల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అప్పటి వరకు కళ్లెదుట తిరిగిన వాళ్లే కరోనాకు బలవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త

Published : 14 May 2021 12:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అప్పటి వరకు కళ్లెదుట తిరిగిన వాళ్లే కరోనాకు బలవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. ఆస్పత్రి మెట్లు ఎక్కకుండానే మృత్యు ఒడికి చేరుతున్న వారెందరో..!  అలాంటి వారికి సాయం చేయడానికి, సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి  ప్రాణాలు నిలబెట్టడానికి ఓ యువకుడు ముందుకొచ్చాడు. పేదవారి కోసం రెండు అంబులెన్స్‌లు  ఏర్పాటు చేసి.. భయం లేదు.. నేనున్నా అని భరోసా ఇస్తున్నాడు. ఆకలితో అలమటిస్తున్న ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు. ఇంతకీ ఆయనెవరు? ఆయన్ను ఆ దిశగా పురిగొల్పిన సంఘటన ఏంటి..?

తమిళనాడులోని విరుద్‌నగర్‌... రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవరైనా సాయం చేసి ఆస్పత్రికి తీసుకెళ్తే బతికే వాడేమో..? కానీ, సమయానికి అంబులెన్స్‌ రాలేదు. ఫలితం.. ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటన 2008లో జరిగింది.  ఆ మృతుడి అన్నయ్యే పృథ్వీరాజ్‌. ఈ ఘటనతో చలించిపోయాడు. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తమ్ముడిని తీసుకెళ్లలేకపోయానే అనే బాధతో కుమిలిపోయాడు. మారుమూల ప్రాంతంలో ఉండటం వల్లే ఇలా జరిగిందని.. ముఖ్యంగా తనలాంటి పేద ప్రజలకు ఇలాంటి పరాభవం ఎదురుకాకూడదని గట్టిగా అనుకున్నాడు.  కానీ, ఆర్థిక పరిస్థితులు అతడి ముందరికాళ్లకు బంధం వేశాయి. అప్పటికి ఇంకా కళాశాల విద్యనభ్యసిస్తుండటంతో ఏమీ చేయలేకపోయాడు. కానీ, తన సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.

జీతంలో సగం పొదుపు చేసి..

చదువు పూర్తయిన తర్వాత  2011లో విలేజ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఓ ఉద్యోగం సంపాదించాడు. గౌరవప్రదమైన వేతనం. ఉద్యోగంలో చేరిన మొదట్నుంచీ దాదాపు 50 శాతం డబ్బును పొదుపు చేసేవాడు. ఇలా రూ. 1,80,000 మొత్తాన్ని పోగు చేశాడు. దీంతో ఓ పాత ఓమ్నీ వాహనం కొని చిన్నపాటి మార్పులు చేసి అంబులెన్స్‌గా మార్చాడు. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఓ మెడికల్‌ కిట్‌ను కూడా సమకూర్చుకున్నాడు. చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుంచి ఫోన్‌ చేసి అవసరమని చెప్పినా.. నిమిషాల వ్యవధిలో అక్కడుండేవాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఎంతో మంది ప్రాణాలు నిలిపాడు. ఆయన సేవలు అలా జిల్లా మొత్తం వ్యాపించాయి. ఫోన్లు కూడా ఎక్కువగా వస్తుండేవి. దీంతో ఓ శిక్షణ కలిగిన డ్రైవర్‌ను పెట్టుకొని సేవలు కొనసాగించాడు.

ఎన్‌జీవో ఏర్పాటు

ఆయన సేవలను మెచ్చి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు సాయం చేయడం మొదలు పెట్టారు. తన సేవలను మరింత విస్తృతం చేయడం కోసం ‘రాజేష్‌ ఉధవమ్‌  కరంగల్‌’ పేరిట ఓ ఎన్‌జీవోను స్థాపించాడు. తన ఇంటికి కొన్ని మార్పులు చేసి గూడు లేని వాళ్లకు అక్కడ ఆశ్రయం కల్పించడం, అన్నదానం చేయడం తదితర కార్యక్రమాలు మొదలు పెట్టాడు. దాదాపు 15 మంది వాలంటీర్లు వీరికి సాయంగా ఉంటారు. సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో దాతలు ఇచ్చిన సొమ్ముతో ఓ పాత వ్యాన్‌ను కొనుగోలు చేసి, అంబులెన్స్‌గా మార్చాడు. పృథ్వీరాజ్‌ సేవలు మెచ్చి కొందరు డాక్టర్లు, నర్సులు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన దగ్గర ఐదుగురు వాలంట్లీర్లు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుంచి ఫోన్‌ వచ్చినా వెంటనే వారు స్పందిస్తారు. పేదవారి దగ్గర ఎలాంటి రుసుము తీసుకోరు. ఆర్థికంగా కాస్త ఫర్వాలేదు అనుకుంటే వాళ్లకు నచ్చినంత ఇవ్వొచ్చు. దీనిని ఎన్‌జీవో నిర్వహణకు, పెట్రోలు ఖర్చుల కోసం వినియోగిస్తారు.

కరోనాను ఎదిరించి మరీ..

ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పృథ్వీరాజ్ అందరికీ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఎంతో మంది సకాలంలో అస్పత్రికి చేరక కన్నుమూస్తున్న తరుణంలో వారందరికీ బాసటగా నిలుస్తున్నాడు. ‘‘ ఉత్నతాధికారుల అనుమతితో పీపీఈ కిట్లు ధరించి నాతోపాటు ఐదుగురు వాలంటీర్లు కూడా మారుమూల ప్రాంతాల నుంచి కొవిడ్‌ బాధితులను ఆస్పత్రులకు చేరుస్తున్నాం.’’ అని పృథ్వీరాజ్‌ చెబుతున్నారు. కరోనా మహమ్మారి ఎంతో మందికి ఉపాధిని దూరం చేసింది. తినడానికి తిండిలేక అల్లాడుతున్న వారెందరో.. అలాంటి వారికి కూడా పృథ్వీరాజ్‌ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. గత ఏడాది నుంచి ప్రతి రోజూ 120 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నిత్యాన్నదానం కోసం ఇప్పటికి 500 మంది దాతలు ఆర్థిక సాయం చేస్తురని, ఎవరైనా దాతలు ముందుకొస్తే సేవలను మరింత విస్తృతం చేస్తామని పృథ్వీరాజ్‌ అంటున్నారు. ఆ రోజు సకాలంలో వైద్యం అందక తన తమ్ముడు మరణించాడనీ, అలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నానని పృథ్వీరాజ్‌ చెబుతున్నారు... ఆయన ఆలోచన.. ఆశయం ఎంత గొప్పవో కదా..!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని