Budget: మధ్యంతర పద్దు మురిపిస్తుందా?

కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం ఊరిస్తున్నవేళ ఈ పద్దులో మోదీ సర్కారు జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా..?

Updated : 09 Jul 2024 15:41 IST

కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌ (Union Budget 2024) సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం ఊరిస్తున్నవేళ ఈ పద్దులో మోదీ సర్కారు జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా..? వాటి జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యమిస్తుందా..? లేదంటే సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా..? ఇలాంటి ప్రశ్నలపై అంతటా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. తాత్కాలిక పద్దే అయినా ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపుతుందని వివిధ వర్గాలు ఆశగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక స్థిరీకరణకే సర్కారు పెద్దపీట వేయొచ్చని పారిశ్రామిక, వాణిజ్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.


అన్నదాతలకు మరింత అండ?

వర్షాభావంతోపాటు పలు ఇతర సమస్యలతో దేశవ్యాప్తంగా రైతన్నలు ప్రస్తుతం సతమతమవుతున్నారు. వారిని ఆదుకునేందుకు, ఆకట్టుకునేందుకు బడ్జెట్‌లో సర్కారు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పుడు కేంద్రం  అన్నదాతలకు ఏడాదికి రూ.6 వేలు (మూడు దఫాల్లో) పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఆ మొత్తాన్ని రూ.9 వేలకు పెంచే అవకాశాలు ఉన్నాయని జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందరికీ కాకపోయినా మహిళా రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని ఇంకొందరు చెబుతున్నారు. తద్వారా మహిళా ఓటర్లను మోదీ సర్కారు తనవైపునకు తిప్పుకొనే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నారు. ఎరువుల రాయితీలు, పంట బీమాల విషయంలోనూ రైతులకు అనుకూల ప్రకటనలు ఈ పద్దులో ఉంటాయని అంచనాలు ఉన్నాయి.


గ్రామీణుల కొనుగోలు శక్తి పెరగాలి

దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించింది. అందుకు ప్రధాన కారణం- గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పడిపోవడమే. ఏడాది క్రితంతో పోలిస్తే.. 2023 నవంబరులో గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు 9.6% తగ్గాయి. గ్రామీణుల ఆదాయం, కొనుగోలు శక్తి పెంపుపై కేంద్రం దృష్టిసారించాలి.  వ్యవసాయేతర ఆదాయాన్ని పెంచుకునేలా చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించాలి. మరోవైపు- విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగాలి. పీఎం ఆవాస్‌ యోజన, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఈ దఫా బడ్జెట్‌లో  ప్రాధాన్యం పెంచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలను ప్రకటించే అవకాశాలనూ కొట్టిపారేయలేమని పేర్కొంటున్నారు.


వృద్ధిరేటు భేష్‌

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా సంక్షోభం వంటి పరిస్థితులతో అంతర్జాతీయంగా ఒడుదొడుకులున్నా.. ప్రస్తుతం భారత వృద్ధి అంచనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7-7.3% మధ్య ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని, 2025 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మన దేశం కాంక్షిస్తోంది. అవి సాకారమవ్వాలంటే.. వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను, ‘మేకిన్‌ ఇండియా’ను ఇంకా ప్రోత్సహించాలి. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయాలి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 డిసెంబరులో 5.7%ను తాకింది. దానికి కళ్లెం వేసే చర్యలు చేపట్టాలి.


వేతన జీవికి ఊరట?

ఆదాయపు పన్ను స్లాబుల్లో ఈ దఫా పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చన్నదే ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అల్ప, మధ్యాదాయ వేతన జీవులకు ఊరట కల్పించేలా ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్‌ డిడక్షన్‌) పరిమితిని రూ.లక్షకు పెంచొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిమితి అయిదేళ్లుగా  రూ.50 వేలుగానే ఉంది. ద్రవ్యోల్బణం పెరిగినా ఇన్నాళ్లూ దాన్ని కేంద్రం సవరించలేదు.


రైల్వేకు మరింత జోష్‌!

కొన్నేళ్లుగా రైల్వే ఆధునికీకరణకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. సరకు రవాణా నడవాల ఏర్పాటు, డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులను వేగంగా చేపడుతూ.. క్రమంగా హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. అదే పంథాను కొనసాగిస్తూ.. మరిన్ని ఆధునిక, వందేభారత్‌, హైస్పీడ్‌ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలో మూలధన వ్యయం తగ్గకుండా చూసేందుకు తాత్కాలిక పద్దులోనే ఏకంగా రూ.2.8-3 లక్షల కోట్ల వరకు ఆ శాఖకు కేటాయించొచ్చనీ అంచనాలు వెలువడుతున్నాయి.


‘భవిష్యత్తు’ను మరవొద్దు

భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి ఊపు తీసుకురాగల సమర్థత ఉన్న పునరుత్పాదక ఇంధనాలు, ఫిన్‌టెక్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఆరోగ్య సేవలు-బీమా, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాలకు బడ్జెట్‌లో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా చూడాలి. భారత ఎగుమతుల్లో దాదాపు 40% వాటా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఉత్పత్తులదే. ఆ రంగంలోనివారికి రుణ వెసులుబాట్లు పెంచాలి.


మూలధన వ్యయం పెంపు?

గత అయిదేళ్లలో ప్రభుత్వ మూలధన వ్యయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. దేశంలో మౌలిక వసతుల కల్పన ఊపందుకుంది. పీఎం గతిశక్తి పథకంతో పలు ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ బాగా విస్తరించింది. అదే బాటలో మౌలిక వసతులపై మూలధన వ్యయం పెంపునకు మోదీ సర్కారు మధ్యంతర పద్దులోనూ మొగ్గుచూపొచ్చు! మూలధన వ్యయం పెరిగితే జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.9%గా ఉంది. 2025-26 కల్లా దాన్ని 4.5%కు తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. 2023-24లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. బడ్జెట్‌లో విధించుకున్న లక్ష్యాలను మించడం సర్కారుకు సంతోషాన్నిచ్చేదే.



ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని