Jammu and Kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి.. తొమ్మిది మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు.

Updated : 09 Jun 2024 23:23 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగారు. యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికులు వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తుండగా రియాసీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉగ్రవాదుల కాల్పుల క్రమంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాస్తవానికి పొరుగున ఉన్న రాజౌరీ, పూంఛ్‌ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో గతంలో ఉగ్రకార్యకలాపాలు తక్కువే. తాజా దాడిపై సమాచారం అందుకున్న భద్రత బలగాలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

గత మూడు దశాబ్దాల్లో జమ్మూ-కశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. గతంలో 2017 జూలైలో కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.

యాత్రికులపై ఉగ్ర దాడిని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కశ్మీర్‌లో ఆందోళనకరంగా ఉన్న భద్రత పరిస్థితుల వాస్తవ రూపాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఆయనతోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని