Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్‌ అప్రమత్తమై సురక్షితంగా దించేశారు.

Updated : 03 Feb 2023 13:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబుదబీ నుంచి భారత్‌కు వస్తున్న ఓ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో మంటలు రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

శుక్రవారం ఉదయం అబుదబీ (Abu Dhabi) నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానం కాలికట్‌ (కోజికోడ్‌) బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయి విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించి పైలట్‌ వెంటనే విమానాన్ని అబుదబీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు డీజీసీఏ (DGCA) వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారులు తెలిపారు.

ఇటీవల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express)కు చెందిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. గత నెల 23న తిరువనంతపురం నుంచి మస్కట్‌ బయల్దేరిన విమానంలో 45 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం కారణంగా వెనక్కి మళ్లింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని