LS polls: ప్రచారానికి తెర.. లోక్‌సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!

ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది.

Published : 17 Apr 2024 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల సమరానికి (Lok Sabha Elections) సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. తొలి దశ పోలింగ్‌కు సంబంధించి ప్రచారానికి నేటితో తెర పడింది. రాజకీయ పార్టీల ప్రచారంతో మార్మోగిన మైకులు.. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మూగబోయాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న మొదటి విడత పోలింగ్‌ జరగనుంది.

తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉండగా అక్కడ ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది. రాజస్థాన్‌ 12, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మధ్యప్రదేశ్‌ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో అయిదు చొప్పున, బిహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయాల్లో రెండు చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలలో ఒక్కో లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది.

బరిలో 8 మంది కేంద్ర మంత్రులు..

తొలిదశ పోలింగ్‌లో భాగంగా మొత్తం ఎనిమిది మంది మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్‌ పోటీలో ఉన్నారు. నాగ్‌పుర్‌ స్థానం నుంచి బరిలో ఉన్న కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.. హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. ఏడుసార్లు ఎంపీగా పనిచేసిన విలాస్‌ ముత్తెంవార్‌ను 2014 ఎన్నికల్లో ఓడించిన ఆయన.. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోల్‌పై 2.16 లక్షల మెజార్టీతో గెలుపొందారు.

అరుణాచల్‌ వెస్ట్‌ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పోటీలో ఉన్నారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిగా మాజీ సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నబం తుకీ బరిలో ఉన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ పోటీ చేస్తున్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌, ఎల్‌.మురుగన్‌ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. త్రిపురలో రెండు స్థానాలుండగా, వెస్ట్‌ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ పోటీలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. చెన్నై సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని