India-Canada: భారత్‌-కెనడా మధ్య ముదిరిన ఖలిస్థానీ చిచ్చు.. మన రాయబారిపై ట్రూడో బహిష్కరణ వేటు

భారత దౌత్యవేత్తపై కెనడా బహిష్కరణ వేటు వేసింది. సిక్కు వేర్పాటువాద నేత హత్య కేసులో భారత హస్తం ఉందని కెనడా ఆరోపించింది.

Updated : 19 Sep 2023 12:39 IST

టొరొంటో: ఖలిస్థానీ అంశంతో భారత్‌-కెనడా (India-Canada) మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ఆరోపించారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్త (Indian diplomat)పై బహిష్కరణ వేటు  పడింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ అధిపతిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.

ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (45) కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌, ‘గురునానక్‌ సిక్‌ గురుద్వారా సాహిబ్‌’ అధిపతి అయిన హర్‌దీప్‌.. భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. అతడి తలపై రూ.10లక్షల రివార్డు ఉంది.

కాగా.. నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో సోమవారం పార్లమెంట్‌ దిగువ సభలో మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కెనడా పౌరుడు హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చనేందుకు విశ్వసనీయమైన ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా కెనడియన్‌ భద్రతా ఏజెన్సీలు ఈ హత్య వివరాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై తమ ఆందోళనలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కెనడా గడ్డపై మా దేశ పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వాల జోక్యాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం. అది మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. ఈ ఘటనలో దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నా’’ అని ట్రూడో అన్నారు.

దౌత్యవేత్తపై వేటు..

ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు. ఈ మేరకు టొరంటో మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఒట్టావాలోని భారత ఎంబసీ స్పందించలేదు.

తీవ్రంగా ఖండించిన భారత్‌..

కాగా.. ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత్‌ జోక్యం ఉందంటూ ఆ దేశం అసంబద్ద, ప్రేరేపిత ఆరోపణలు చేస్తోంది. చట్టబద్దమైన పాలన పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలే చేశారు. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్‌ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం. కెనడాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటివి జరగడం కొత్తేం కాదు. అలాంటి వాటిల్లోకి భారత ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలో నుంచి భారత వ్యతిరేక శక్తులను వెళ్లగొట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మేం మరోసారి కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ (MEA) తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని