EC: కార్‌పూలింగ్‌.. ప్లాస్టిక్‌ కట్టడి.. పర్యావరణహిత ఎన్నికలకు ‘ఈసీ’ పిలుపు

ప్రచారం, ఎన్నికల నిర్వహణలో కాగితం వినియోగం తగ్గింపు, కర్బన ఉద్గారాల కట్టడి తదితర అంశాల్లో పార్టీలు, అధికార యంత్రాంగానికి ‘ఈసీ’ కీలక సూచనలు జారీ చేసింది.

Published : 17 Mar 2024 21:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఎన్నికల సందడి (Lok Sabha Elections) మొదలైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు సభలు, రోడ్‌ షోలు, ఇంటింటికి తిరుగుతూ.. అధికార, విపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచనున్నాయి. ఈ క్రమంలోనే కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు ఇతరత్రా రూపాల్లో పెద్దఎత్తున ప్రచార సామగ్రి వాడకంలోకి రానుంది. ఎన్నికల, రాజకీయ కార్యకలాపాలకు వాహనాల వినియోగం కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణహిత పోలింగ్‌ నిర్వహణకు ఈసీ (Election Commission) పిలుపునిచ్చింది. వ్యర్థాల నిర్వహణ, కాగితం వినియోగం తగ్గింపు, కర్బన ఉద్గారాల కట్టడి విషయంలో అధికార యంత్రాంగం, పార్టీలకు కీలక సూచనలు జారీ చేసింది.

‘‘ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వినియోగాన్ని పూర్తిగా నివారించి, ప్రత్యామ్నామాలు ఎంచుకోవాలి. వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ విషయంలో తగు చర్యలు అవసరం. ఓటర్ల జాబితా ఇతరత్రా సామగ్రి విషయంలో కాగితం వినియోగాన్ని తగ్గించి, పేపర్‌కు రెండువైపులా ప్రింటింగ్‌ అవకాశాలను పరిశీలించాలి. సమాచార మార్పిడి కోసం ఆన్‌లైన్‌ విధానం మేలు. కార్‌పూలింగ్‌ (ఒకే వాహనంలో పలువురు ప్రయాణించడం), ప్రజారవాణా వినియోగాన్ని పెంచడంతోపాటు ఓటర్లకు ప్రయాణ దూరాన్ని తగ్గించేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రచార కార్యక్రమాల్లో పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి’’ అని ఈసీ సూచించింది.

ఉద్గారాలను లెక్కగట్టి.. చెట్లను నాటి..

  • పర్యావరణహిత ఎన్నికల దిశగా గతంలో ప్రయత్నాలు జరిగాయి. శ్రీలంకకు చెందిన శ్రీలంక పొదుజన పెరమున పార్టీ 2019లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా ప్రచారం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఉపయోగించిన వాహనాలు, విద్యుత్ వినియోగానికి సంబంధించిన కర్బన ఉద్గారాలను లెక్కగట్టింది. అనంతరం ప్రజల భాగస్వామ్యంతో చెట్లను నాటడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసింది.
  • 2019 సార్వత్రిక సమరం సమయంలో కేరళ హైకోర్టు స్థానికంగా ప్రచారంలో ఫ్లెక్సీలు, నాన్-బయోడిగ్రేడబుల్ సామగ్రిపై నిషేధం విధించింది. దీంతో పార్టీలు గోడలపై రాతలు, పేపర్ పోస్టర్లను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకున్నాయి.
  • తిరువనంతపురంలో ‘హరిత’ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కృషి చేసింది. కార్యకర్తలకు గ్రామాల్లో శిక్షణా సమావేశాలు నిర్వహించింది. 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పర్యావరణహిత సామగ్రితో రూపొందించిన పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని