Microphone: సీఎం ప్రసంగంలో ‘మైకు గోల’.. కేసు నమోదు చేయడంపై దుమారం!

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ఇటీవల పాల్గొన్న సభలో ‘మైక్‌’ (Microphone) మొరాయించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం తీవ్ర దుమారానికి కారణమయ్యింది.

Published : 26 Jul 2023 19:43 IST

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ఇటీవల పాల్గొన్న సభలో ‘మైక్‌ చేసిన గోల’ (Microphone) అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ‘మైకు మొరాయించడమే’ ఇందుకు కారణం. కొద్దిసేపు మైకు అంతరాయం కలిగించడం ఎలా ఉన్నా.. ఈ ‘ఘటన’పై కేసు నమోదు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ ఘటనలో నిందితులుగా ఎవ్వర్నీ చేర్చకపోవడం ఒక ఎత్తైతే.. మైకుతోపాటు యాంప్లీఫైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘మైకు’పైనే కేసు పెడతారా?అంటూ విపక్ష కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు విసరగా.. అటు సోషల్‌ మీడియాలోనూ ఈ వ్యవహారంపై ట్రోల్స్‌ నడుస్తున్నాయి.

కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ (Oommen Chandy) సంస్మరణ సభను తిరువనంతపురంలోని అయ్యంకాళి హాల్‌లో కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం పినరయి విజయన్‌.. తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అదే సమయంలో కొన్ని క్షణాల పాటు పెద్ద శబ్దంతో మైక్‌ మొరాయించింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు రానప్పటికీ స్థానిక కంటోన్మెంట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మైక్‌ ఆపరేటర్‌ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం మైక్‌, యాంప్లీఫైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. అంతరాయం కలిగించినందకు మైక్‌ పైనే కేసు పెట్టి అరెస్టు చేస్తారా? అంటూ పోలీసుల తీరును ప్రశ్నించింది.

ఇల్లు అద్దెకిచ్చి కోర్టుకెళ్లాల్సి వచ్చింది.. ఓ సీఈఓ ఆవేదన

‘మైకు గోల’ ఘటనపై కేసు నమోదు చేయడాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని.. కేవలం సాంకేతిక సమస్యకు గల కారణాలను పరీక్షించేందుకే వాటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దీనిపై మైకు ఆపరేటర్‌ స్పందిస్తూ.. పోలీసుల తీరు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సభలకూ తానే పరికరాలను ఏర్పాటు చేశానని.. ఎన్నడూ ఏ సమస్యా రాలేదని వాపోయాడు. దీనిపై అటు సోషల్‌ మీడియాలోనూ సెటైర్ల పర్వం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు