DK Shivakumar: వేధించడానికీ ఓ హద్దుంటుంది: డీకే శివకుమార్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను విచారించేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

Published : 05 Jan 2024 17:45 IST

దిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar)ను మరింత విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) ఆ రాష్ట్ర హైకోర్టును (Karnataka HighCourt) ఆశ్రయించింది. దీనిపై శివకుమార్‌ను మీడియా ప్రశ్నించగా.. తనను ఉద్దేశపూర్వకంగా వేధించాలని కొందరు చూస్తున్నారని అన్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమేనని చెప్పారు. ‘‘వేధించడానికి కూడా ఓ హద్దుంటుంది. దీని వెనుక ఎవరున్నారో తెలియడం లేదు. ఏదేమైనా కాలమే సమాధానం చెబుతుంది. వాళ్లేం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ, నేను దేనికైనా రెడీ. గతంలో నన్ను జైలుకు పంపిస్తే ప్రజలంతా నా వెన్నంటి నిలిచారు. న్యాయం కోసం పోరాడతా’’ అని అన్నారు.

డీకే శివకుమార్‌పై దర్యాప్తునకు గతేడాది తెలిపిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న డీకే శివకుమార్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కేసు నమోదైంది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా, భాజపా ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమంటూ దర్యాప్తును ఉపసంహరించుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పక ముందే ఆగమేఘాల మీద అనుమతిచ్చారని సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. దీనిపై ప్రతిపక్ష భాజపా, జేడీఎస్‌ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. శివకుమార్‌ను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయా పార్టీలు విమర్శించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని