central Railway: సెంట్రల్‌ రైల్వే రికార్డ్‌.. జరిమానాలతో రూ.300 కోట్లు వసూలు

రైల్వేలను (Indian Railways) ఎంత ఆధునికీకరిస్తున్నా.. కొత్తతరం రైళ్లను పట్టాలెక్కిస్తున్నా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా టికెట్‌లేని ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి..

Published : 06 Apr 2024 01:04 IST

ముంబయి: రైల్వేలను (Indian Railways) ఎంత ఆధునికీకరిస్తున్నా.. కొత్తతరం రైళ్లను పట్టాలెక్కిస్తున్నా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా టికెట్‌లేని ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి సెంట్రల్‌ రైల్వే (Central Railway) ఓ ప్రకటన విడుదల చేసింది. 2023-24 ఏడాదిలో జరిమానా రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు పేర్కొంది. టికెట్‌ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్‌ చేయకుండానే లగేజ్‌ను తరలించడం.. తదితర కారణాలతో నమోదు చేసిన 46.26 లక్షల కేసుల్లో భారీ స్థాయిలో జరిమానా వసూలు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. 2023-24 ఏడాదిలో దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో వసూలైన మొత్తంతో పోలిస్తే ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.

దీనికి సంబంధించి ముంబయి కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వే కార్యాలయ అధికారులు పలు వివరాలు వెల్లడించారు. ‘‘కేసుల నమోదు, ఆదాయం పరంగా మిగతా జోన్‌లతో పోలిస్తే సెంట్రల్‌ రైల్వే జోన్‌లోనే అధికంగా నమోదయినట్లు పేర్కొన్నారు. ‘‘ముంబయి డివిజన్‌ పరిధిలో టికెట్‌ లేకుండా ప్రయాణం చేయడం వంటి కారణాలతో 20.56 లక్షల కేసులు నమోదు కాగా.. రూ.115.29 కోట్లు జరిమానా వసూలైంది. భుసావల్‌ డివిజన్‌ పరిధిలో 8.34 లక్షల కేసులకు గాను రూ. 66.33 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది’’ అని సెంట్రల్‌ రైల్వే పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు