Social media Influencers: సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు... జాగ్రత్త: కేంద్రం

Socialmedia Influencers: సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కీలక సూచన చేసింది. 

Published : 21 Mar 2024 22:41 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో ఆన్‌లైన్‌ కంటెంట్‌ వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాధ్యమాలుగా ఉన్న సోషల్‌ మీడియా (Social Media) యాప్‌లు.. ప్రస్తుతం ఎంతోమందికి ఆదాయవనరుగా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేస్తూ పెద్దఎత్తున ఫాలోవర్లు ఉన్నవారిని సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు (Social media Influencers)గా వ్యవహరిస్తున్నారు. వీరు కొన్ని ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తూ ఆయా కంపెనీల నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటివారిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్‌ చేయొద్దని ఇన్‌ఫ్లూయెన్సర్లకు సూచించింది. ఈమేరకు గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేసే ఆన్‌లైన్ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వంటి ప్రకటనలు ప్రజలపై ఆర్థికపరమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. భారతీయ ప్రేక్షకులు లక్ష్యంగా ప్రసారమయ్యే ఇలాంటి ప్రకటనలను ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రోత్సహించవద్దు. సామాజిక మాధ్యమ సంస్థలు ఇలాంటి కంటెంట్‌ తమ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వాటిని ప్రోత్సహిస్తే వినియోదారుల సంరక్షణ చట్టం-2019 ప్రకారం బాధ్యుల సోషల్‌ మీడియా ఖాతాలు తొలగించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కంటెంట్‌ క్రియేటర్ల కోసం ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’లను ప్రవేశపెట్టింది. మొత్తం 20 విభాగాల్లో వీటిని ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల  ప్రభావం సమాజంపై ఉంటుందని, వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని