RVM: 2024 ఎన్నికల్లో ఆర్‌వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ

వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్‌వీఎంలను ఉపయోగించనున్నారనే వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. అలానే ఆర్‌వీఎంలు ఎన్‌ఆర్‌ఐల కోసం మాత్రమే రూపొందించారనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. 

Published : 03 Feb 2023 18:49 IST

దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024 Elections) రిమోట్‌ ఓటింగ్‌ యంత్రాలను (RVM) ఉపయోగించే ఉద్దేశమేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం పలువురు ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆర్‌వీఎంలను పరిచయం చేయాలనే ఆలోచన లేదు. అలానే, ఆర్‌వీఎంలను ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల కోసం మాత్రమే ఉపయోగిస్తారనేది వాస్తవం కాదు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి (EC) సైతం తెలియజేశాం’’ అని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణ కమిటీలోని సాంకేతికత బృందం మార్గదర్శకత్వంలో ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఆర్‌వీఎంలను అభివృద్ధి చేసింది. దేశంలో వలస కార్మికులు వారు ఉన్న చోట నుంచే రిమోట్‌ విధానం ద్వారా ఓటు వేసేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. ఒకేసారి వేర్వేరు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వీటిని తీర్చిదిద్దారు. గత నెలలో దీని పనితీరును పరిశీలించేందుకు రాజకీయ పార్టీలను ఈసీ దిల్లీకి ఆహ్వానించింది. ఈ సమావేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు ఆర్‌వీఎం పనితీరును పరిశీలించేందుకు విముఖత వ్యక్తం చేశాయి. వాటికంటే ముందు ఈసీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (EVM)పై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని కోరాయి. మరోవైపు ఎన్నికల్లో ఆర్‌వీఎంల వినియోగం సవాల్‌తో కూడుకున్నదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ గత నెలలో రాజకీయ పార్టీలతో సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది మెత్తంగా 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాలకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 16, 27 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి మార్చి 2న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇవి ముగిసిన తర్వాత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగియనుంది. ఇవి ముగిసిన తర్వాత వచ్చే ఏడాది 2024 పార్లమెంట్‌ ఎన్నికలు జగరనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్‌వీఎం ఉపయోగించనున్నారనే వార్తల నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని