Sidhu Moose Wala: చట్టపరమైన పత్రాల సమర్పణకు గడువు కావాలి: బాల్‌కౌర్‌ సింగ్

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారం పంజాబ్ ప్రభుత్వం నుంచి సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్‌ చికిత్సకు సంబంధించిన నివేదికను కోరింది. 

Published : 20 Mar 2024 16:57 IST

చండీగఢ్: దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు బాల్‌కౌర్‌ సింగ్, చరణ్‌ కౌర్‌ గత వారం రెండో కుమారుడికి జన్మినిచ్చారు. వీరు ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనే విధానంలోని వయోపరిమితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

బాల్‌కౌర్‌ సింగ్ దంపతులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన వీరు వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉండేందుకు మరో బిడ్డను కనాలని ఆశించారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్‌ ద్వారా చరణ్‌ కౌర్‌ గర్భం దాల్చారని ఆమె సోదరుడు తెలిపారు. గత వారం తమకు రెండో కొడుకు పుట్టినట్లు బాల్‌కౌర్‌ సింగ్ ప్రకటించారు. చిన్నారి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో  పంచుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ప్రస్తుతం కౌర్‌ వయసు 58 ఏళ్లు కాగా.. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ వయసు 60 ఏళ్లు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గతవారం పంజాబ్ ప్రభుత్వం నుంచి సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్‌ చికిత్సకు సంబంధించిన నివేదికను కోరింది. ఈ ప్రక్రియ కోసం ఉండాల్సిన వయోపరిమితి 21-50 సంవత్సరాలని, అయితే సిద్ధూ తల్లికి 58 ఏళ్ల వయసులో ఈ విధానాన్ని అనుసరించడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది.

‘‘బిడ్డకు సంబంధించిన పత్రాలు ఇవ్వమని జిల్లా యంత్రాంగం నన్ను పదేపదే అడుగుతోంది. చికిత్స పూర్తయ్యేవరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఎప్పుడు రమ్మన్నా వస్తాను. ఐవీఎఫ్‌ విధానంలో చట్టబద్ధంగా బిడ్డకు జన్మనిచ్చిన పత్రాలన్నీ మీకు సమర్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను.’’ అని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్న వీడియోను బాల్‌కౌర్‌ సింగ్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు అతన్ని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు