Accidents: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. త్వరలో దేశవ్యాప్తంగా అమలు!

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Published : 04 Dec 2023 20:07 IST

దిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రానున్న మూడు, నాలుగు నెలల్లో దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. మోటార్‌ వాహనాల సవరణ చట్టం 2019లో (MV Act) భాగంగా దీనిని తీసుకురానున్నట్లు తెలిపాయి.

‘ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనుంది’ అని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. గోల్డెన్‌ అవర్‌ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేస్తామన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందన్నారు.

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అత్యధికంగా భారత్‌లోనే ఉంటున్నాయని అనురాగ్‌ జైన్‌ పేర్కొన్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహనపై మాట్లాడిన ఆయన.. ఈ అంశాలను పాఠశాలలు, కాలేజీ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కేంద్ర విద్యాశాఖ కూడా అంగీకరించిందని అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ (IRTE) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్‌ జైన్‌ ఈ వివరాలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని