Bhim Army: భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులు

భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తూటా తగలడంతో ఆస్పత్రిలో చేరారు.

Updated : 28 Jun 2023 19:05 IST

సహ్రాన్‌పూర్‌: ఆజాద్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్‌ ఆర్మీ(Bhim Army) చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌(Chandrashekar Azad) కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. యూపీలోని సహ్రాన్‌పూర్‌లో తన మద్దతుదారుడి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా దుండగులు ఆయనపై బహిరంగంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తూటా తగలడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి డా విపిన్‌ టాడా మాట్లాడుతూ.. ‘‘చంద్రశేఖర్‌ ఆజాద్‌ కాన్వాయ్‌పై కొందరు కారులో వెళ్తూ కాల్పులు జరిపారు. ఆయనకు ఓ తూటా తగిలింది. ఆజాద్‌ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించాం.ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది’’ అని తెలిపారు. 

మరోవైపు, చంద్రశేఖర్‌ ఆజాద్‌పై కాల్పులు జరిపిన వ్యక్తులు హర్యానా లైసెన్స్ నంబర్‌ ప్లేటు కలిగిన కారులో వచ్చి కాల్పులు జరిపి ఆయన్ను గాయపరిచినట్టు గుర్తించారు. ఈ ఘటన సమయంలో చంద్రశేఖర్‌ ఆజాద్ టయోటా ఫార్చ్యూనర్‌ వాహనంలో ప్రయాణిస్తుండగా.. ఆ కారులోని సీటు, డోర్‌పై బుల్లెట్లు తగిలినట్టు గుర్తించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు సమీపంలోకి దూసుకొస్తూ పలు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని