Viral post: రైలులోని అధ్వాన పరిస్థితులపై ట్వీట్‌ వైరల్‌.. స్పందించిన అధికారులు

రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

Published : 21 Mar 2024 00:07 IST

దిల్లీ: రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. చేతక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు బోగీలోని ప్రయాణికుల ఫొటోను జత చేసి రైల్వేలో 3వ శ్రేణి ఏసీ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మనం జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నట్లు ఇలా ఇబ్బందులు పడుతూ ప్రయాణించడానికి ఏసీ కోసం డబ్బులెందుకు చెల్లించాలి. ఇన్ని డబ్బులు పెట్టి టికెట్‌ కొన్నా కూర్చోవడానికి కూడా ఇందులో స్థలం లేదు.  అని పోస్టులో పేర్కొన్నారు.  ఆమె ప్రయాణిస్తున్న ఈ రైలు దిల్లీ సరాయ్ రోహిల్లా, ఉదయపూర్ ల మధ్య నడుస్తుంది.

పోస్టు చేసిన చిత్రంలో ఏసీ త్రీ-టైర్ కోచ్ లో ఇరుకైన స్థలంలో చాలామంది ప్రయాణికులు నిల్చొనే ఉన్నారు. అలసిపోయిన ఓ వ్యక్తి తన చేతిని ఆసరాగా పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఈ పోస్ట్ 24 గంటలలోపే 1.6 మిలియన్ల వీక్షకులను సంపాదించి నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ఫొటోలోని ఫ్యాన్‌ను చూపుతూ మీరు నిజంగానే ఏసీ బోగీలో ఉన్నారా అని ప్రశ్నించారు. సమాధానంగా ఆ మహిళ తన కోచ్‌లోని పెద్ద ఏసీ కిటికీకి సంబంధించిన చిత్రాన్ని షేర్ చేసింది.  క్లాస్3 స్లీపర్ బోగి ఏసీ కాదు అని మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. వారు సామాన్యులు ప్రయాణించే రైళ్లలో కనీస సౌకర్యాలను కల్పించకుండా వందేభారత్, బుల్లెట్ ట్రైన్‌లను ప్రజలకు అందించడంలో బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ ప్రయాణికులు ఇలాంటి సందేశాలను పోస్ట్ చేస్తారు. కానీ ఏం లాభం లేదని మరొకరు వ్యాఖ్యానించారు.

అశ్విని వైష్ణవ్ సార్, మేము మంచి రైలు ప్రయాణ అనుభవాన్ని ఎప్పుడు పొందగలం? మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అలాగే ఈ సమస్యను కూడా పరిష్కరించాలి అని మరో నెటిజన్‌ కోరారు. సామాజిక మాధ్యమాలలో పోస్టు వైరలవడంతో రైల్వే అధికారులు స్పందించి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని