Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో ఈసారి అత్యధికులు కోటీశ్వరులేనట. 80శాతం ఎమ్మెల్యేలకు రూ.కోటి కంటే ఎక్కువే ఆస్తులున్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

Published : 06 Dec 2023 18:53 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయం సాధించిన ఎమ్మెల్యే (MLAs)ల ఆస్తులపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో 80శాతం కోటీశ్వరులేనని తేలింది. ఇందులో అత్యధికులు భాజపా (BJP)కు చెందినవారేనని ఏడీఆర్‌ వెల్లడించింది.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఇందులో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల్లో భాజపాకు 54, కాంగ్రెస్‌కు 35 సీట్లు దక్కాయి. అయితే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 72 మంది (80శాతం) కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. భాజపాకు చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో 43 మందికి రూ.కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు తెలిపింది. ఇక, కాంగ్రెస్‌ (Congress) తరఫున గెలిచిన వారిలో 29 మంది కోటీశ్వరులని నివేదిక పేర్కొంది.

వారి రాజకీయ చతురత రాహుల్‌ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్‌ ముఖర్జీ

ఈసారి కొత్త ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.5.25కోట్లుగా ఉంది. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ (రూ.11.63కోట్లు) కంటే ఇది తక్కువేనని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. తాజాగా ఎన్నికైన వారిలో అత్యధికంగా భాజపా ఎమ్మెల్యే భవన్‌ బోరాకు రూ.33.86కోట్ల నికర ఆస్తులు ఉన్నాయి. ఆ తర్వాత రూ.33.38కోట్ల ఆస్తులతో కాంగ్రెస్‌ నేత భూపేశ్ బఘేల్‌ రెండో స్థానంలో ఉన్నారు.

ఇక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 33 మంది శాసనసభ్యులు 5 నుంచి 12వ తరగతి చదివినవారే. 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నత విద్యను అభ్యసించారు. ఇద్దరు డిప్లోమా పూర్తి చేసినట్లు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని