Assembly Polls: పోలింగ్‌కు సిద్ధమైన బస్తర్‌.. 12 స్థానాల్లో 60వేల మందితో భద్రత!

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ డివిజన్‌లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. 600 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.

Published : 06 Nov 2023 16:29 IST

రాయ్‌పుర్‌: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌.. అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో మంగళవారం పోలింగ్‌ జరగనుండగా.. ఇందులో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్‌ పరిధిలోనే ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఈ ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ డివిజన్‌లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దీంతో నిఘాను పటిష్ఠం చేసిన అధికారులు.. అక్కడ మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 40 వేల మంది సీఆర్‌పీఎఫ్‌, 20 వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. వీరిలో మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా (CoBRA) యూనిట్‌, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.

హెలికాప్టర్లో పోలింగ్‌ సిబ్బంది..

భద్రతా కారణాల దృష్ట్యా ఈ డివిజన్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 149 పోలింగ్‌ స్టేషన్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌, భద్రతా క్యాంపులకు తరలించారు. పోలింగ్‌ నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను పర్యవేక్షించనున్నారు. వీటితోపాటు బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించారు. 156 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ సిబ్బందితోపాటు ఈవీఎంలను హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తున్నారు.

భయం గుప్పిట్లో బస్తర్‌

బస్తర్‌ ప్రాంతంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నారాయణ్‌పుర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా నేతను మావోయిస్టులు హత్య చేశారు. 2018 ఎన్నికల సమయంలోనూ మావోయిస్టులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దంతెవాడ జిల్లాలో ముగ్గురు పోలీస్‌ సిబ్బందితోపాటు దూరదర్శన్‌ కెమెరామెన్‌ మావోల దాడిలో చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 మంది భద్రతా సిబ్బందిని మావోయిస్టులు పొట్టనపెట్టుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ తొలి విడతలో 20 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇక బస్తర్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని