Assembly Elections: ఛత్తీస్‌గఢ్‌ మంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి..!

ఛత్తీస్‌గఢ్‌ మంత్రి గురు రుద్ర కుమార్‌ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

Updated : 10 Nov 2023 11:47 IST

రాయ్‌పుర్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ (Assembly Elections) ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నవంబర్‌ 7న జరిగిన తొలిదశ ఎన్నికల సమయంలో పలుచోట్ల మావోయిస్టులు రెచ్చిపోగా.. తాజాగా రాష్ట్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. మంత్రి గురు రుద్రకుమార్‌ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంతోపాటు మరో వాహనం దెబ్బతింది. గురు రుద్రకుమార్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగా.. ఆయన సిబ్బందికి మాత్రం స్వల్పగాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని అహివారా ఎమ్మెల్యేగా ఉన్న గురు రుద్రకుమార్‌.. ఈసారి మాత్రం నవాగఢ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలో నిలిచారు. నవాగఢ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గురుదయాళ్‌ సింగ్‌ బంజారేకు టికెట్‌ తిరస్కరించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. రుద్రకుమార్‌ను అక్కడ బరిలో నిలిపింది. ఈ క్రమంలోనే రుద్రకుమార్‌ స్థానికంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఝాల్‌ గ్రామం వద్దకు చేరుకున్న ఆయన కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్దారు. ఈ ప్రమాదంలో మంత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెమెతారా ఎస్పీ భావనా గుప్తా వెల్లడించారు.

10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరివేశాం : మోదీ

ఇదిలాఉంటే, 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7న తొలిదశలో 20 స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న రెండోదశలో పోలింగ్ జరగనుంది. తొలిదశ అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు