ఈ ఎంపీలిద్దరూ.. ఒకప్పుడు కలిసి సినిమా చేశారని తెలుసా..?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ఎంపీలు ఇద్దరు గతంలో ఒక సినిమాలో కలిసి నటించారు. వారెవరంటే..?

Updated : 11 Jun 2024 16:23 IST

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలు దక్కపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన సీట్లనైతే ఎన్డీయే సాధించింది. దాంతో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సమయంలో ఇద్దరు ఎంపీలకు సంబంధించి 13 ఏళ్ల నాటి ఓ విషయం ఆసక్తిగా మారింది. అదేంటంటే..?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోపక్క ఎన్డీయే కూటమికి పూర్తి మద్దతు పలుకుతోన్న లోక్‌జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్‌ పాసవాన్ (Chirag Paswan) బిహార్‌లోని హాజిపుర్ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారని తెలుసా..? 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్‌’ చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు. నటనపై ఆసక్తి ఉన్న చిరాగ్‌.. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఈ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి, తండ్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐదు చోట్ల తన పార్టీని గెలిపించుకున్నారు. అటు కంగన బాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉన్నారు. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తొలిసారి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు.

ఈ ఎన్నికల తర్వాత వారికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ‘‘మీకు కంగనా నచ్చదా..? ఆమె సినిమా కెరీర్‌ నచ్చదా..?’’ అని అందులో చిరాగ్‌ ప్రశ్నించడం కనిపించింది. అందుకు ఆయన బదులిస్తూ..‘‘మేమిద్దరం కలిసి నటించడం ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఇప్పుడు ఇద్దరం పార్లమెంట్‌కు వెళ్లనున్నాం’’ అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. 13 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి పార్లమెంట్‌లో కనిపించబోతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని