Siddaramaiah: పదేళ్లలో భాజపా పాలిత రాష్ట్రాల్లో 20 తొక్కిసలాటలు: కర్ణాటక సీఎం

Eenadu icon
By National News Team Updated : 22 Aug 2025 15:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై శుక్రవారం జరిగిన అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చుతూ భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ అటువంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. పదేళ్లలో.. భాజపా పాలిత రాష్ట్రాల్లో 20 తొక్కిసలాట ఘటనలు జరిగాయని.. భాజపా నేతలు వాటిపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.

2008 హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట, అదే ఏడాది జరిగిన జోధ్‌పుర్‌ తొక్కిసలాట, 2021లో హరిద్వార్, 2013 రతన్‌గఢ్, 2023లో మధ్యప్రదేశ్‌, 2024 హాథ్రస్ వంటి ఘటనల్లో జరిగిన తొక్కిసలాట (Stampedes)ల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు భాజపా నేతలు ఏం చేశారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మృతుల వివరాలు కూడా వెల్లడించలేదన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడాన్ని గర్వంగా భావించి పెద్దమొత్తంలో అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియంలో దుర్ఘటన జరిగిందన్నారు. ఒక్కోసారి ప్రజల అంచనాలకు తలవంచాల్సి వస్తుంది కాబట్టి తాము కూడా విజయోత్సవంలో పాల్గొన్నామన్నారు. 

జూన్‌లో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడిన ఘటన విషాదం రేపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ పలువురు ప్రత్యక్ష సాక్షులు, క్రికెట్ సంఘం అధికారులు, పోలీస్‌ అధికారుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. అయితే ఆర్సీబీ విజయోత్సవ ఈవెంట్‌లో భాగంగా తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించిందని గుర్తించింది. స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీసులను మాత్రమే మోహరించారని, ఘటనా స్థలం వద్ద అంబులెన్స్‌లు లేవని చెప్పింది. ఇందులో పోలీసు యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉందని నివేదికలో కమిషన్ వెల్లడించింది. ఇప్పటికే ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ బోర్డు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ సంస్థపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కర్ణాటక హైకోర్టు కూడా ఈ కేసును విచారిస్తోంది. 

Tags :
Published : 22 Aug 2025 13:54 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు