Viral video: మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్‌ దాడి.. సస్పెండ్‌ చేసిన అధికారులు

ఓ కండక్టర్‌ బస్సులోని మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరలవడంతో అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్‌ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

Updated : 30 Mar 2024 14:39 IST

బెంగళూరు:  బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కు చెందిన ఓ బస్సులో మంగళవారం మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన బీఎంటీసీ అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున బిలేకహళ్లి నుంచి శివాజీనగర్‌ వెళ్తున్న బస్సులో మహిళా ప్రయాణికురాలు తాంజులా ప్రయాణిస్తుండగా టికెట్‌ విషయంలో ఆమెకు, కండక్టర్‌ హొన్నప్పనాగప్పకు మధ్య వాగ్వాదం జరగడంతో కండక్టర్‌ ఆమెపై దాడికి దిగాడు.

ప్రయాణికురాలు తన ఫిర్యాదులో తాను కండక్టర్‌ను టికెట్‌ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఆపమని డ్రైవర్‌ను అడగడంతో కండక్టర్‌ తనతో వాగ్వాదానికి దిగాడని తెలిపింది. అనంతరం దుర్భాషలాడుతూ మీద చేయి వేయబోతే చెంపపై కొట్టానని, దీంతో అతడు ఆవేశంతో ఊగిపోతూ తనను తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. కాని ఈ ఘటనకు సంబంధించి నిందితుడు భిన్నంగా వాదిస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలికి ఫ్రీ టికెట్‌ ఇచ్చేందుకు ఆధార్‌ కార్డ్‌ అడిగితే ఆమె చూపించడానికి నిరాకరించిందని కండక్టర్ తెలిపారు. టికెట్‌ అయినా తీసుకోమని అడిగితే వాగ్వాదానికి దిగిందని, ఆమే మొదట తనను చెంపదెబ్బ కొట్టిందని నిందితుడు వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరలవుతుండడంతో స్పందించిన బీఎంటీసీ అధికారులు కండక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. ‘‘మహిళా ప్రయాణికుల భద్రతకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, ప్రత్యేక డోర్లు, ప్యానిక్ బటన్‌ల ఏర్పాటు, ప్రధాన బస్‌స్టేషన్లలో విశ్రాంతి గదులు, హెల్ప్‌లైన్‌ వంటి సౌకర్యాలు కల్పించాం. బీఎంటీసీలో విధులు నిర్వహించే  27,000 మంది డ్రైవింగ్ సిబ్బందికి జెండర్ సెన్సిటైజేషన్ పైనా శిక్షణ అందిస్తున్నాం. మహిళా ప్రయాణికులపై అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.’’ అని బీఎంటీసీ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని