Parliament: ఝార్ఖండ్ అంశంపై పార్లమెంట్‌లో తీవ్ర చర్చ.. విపక్షాల వాకౌట్‌

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టుపై పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. 

Updated : 02 Feb 2024 17:35 IST

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో ఝార్ఖండ్ అంశంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. శుక్రవారం ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత ఇండియా కూటమి నేతలు హేమంత్‌ సోరెన్‌ అరెస్టు అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌ రాజీనామా చేసిన 12 గంటల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఝార్ఖండ్ లో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా చంపయీ సోరెన్‌ ప్రమాణ స్వీకారాన్ని జాప్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని భాజపా ప్రభుత్వం ముక్కలు చేస్తోంది’’ అని ఆరోపించారు. 

ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తోసిపుచ్చారు. ‘‘ఝార్ఖండ్ లో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కారణంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తికి కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతోంది. ఇది ఆ పార్టీ వైఖరికి నిదర్శనం’’ అని విమర్శించారు. మరోవైపు లోక్‌సభలోనూ ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్రం ధోరణికి నిరసనగా ఉభయ సభల నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. 

కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలపై దుమారం

బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే.. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటుచేయాలనే డిమాండ్ పెరుగుతుందని గురువారం కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్‌ వ్యాఖ్యానించారు. దీనిపై ఉభయసభల్లోనూ తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో పీయూష్‌ గోయల్‌ డిమాండ్ చేశారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్‌ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని ఖర్గే స్పష్టం చేశారు. డీకే సురేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి డిమాండ్ చేశారు. 

మరోవైపు ఉభయ సభల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్లమెంట్‌లోని తన ఛాంబర్‌లో కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీనికి హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, అనురాగ్‌ ఠాకూర్‌, నితిన్‌గడ్కరీ, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని