Assembly Elections: సంక్షేమ పథకాలే ఆయుధంగా కాంగ్రెస్‌.. అభివృద్ధిపైనే భాజపా ఆశలు!

తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ (Assembly Elections) విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Published : 09 Oct 2023 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ (Assembly Elections) విడుదలైంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారాన్ని కాపాడుకునేందుకు అధికారంలో ఉన్న పార్టీలు, ఎలాగైనా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు (2024 General Elections) ముందు ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలు రావడంతో జాతీయ పార్టీలు కూడా వీటిని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌, భాజపాల పరిస్థితిని పరిశీలిస్తే..

సంక్షేమ పథకాలే ఆయుధాలుగా..

ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. 90 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 71చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. భాజపా కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్‌లో పలు ప్రాంతీయ పార్టీలున్నప్పటికీ కొన్నేళ్లుగా భాజపా, కాంగ్రెస్‌ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ పాపులారిటీ, సంక్షేమ పథకాలనే నమ్ముకున్న కాంగ్రెస్‌.. అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్న భాజపా.. ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. ప్రధాని మోదీతోపాటు అమిత్‌ షా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని ఆమ్‌ఆద్మీ కూడా ప్రయత్నిస్తోంది.

రాజస్థాన్‌లో పోటాపోటీ..

రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు భాజపా ఈసారి తీవ్ర పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవలే వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. రాజస్థాన్‌లో మాత్రం తీవ్ర పోటీ ఉందని, గెలిచే అవకాశాలున్నాయని అన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో 1993 నుంచి పోలింగ్‌ సరళి చూస్తే.. అక్కడ ఓసారి కాంగ్రెస్‌, మరోసారి భాజపాలు అధికారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో భాజాపాకు అవకాశాలున్నాయనే ఊహాగానాలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మాత్రం సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం, వంటగ్యాస్‌పై రాయితీ, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కింద నెలకు వెయ్యి రూపాయలు వంటి పథకాలను ప్రకటిస్తున్నారు. ఇటీవలే కులగణన చేపట్టేందుకు అవసరమైన ఆదేశాలు జారీచేసింది. కాంగ్రెస్‌ను వర్గపోరు వెంటాడుతుండగా.. దాన్ని అవకాశంగా మలచుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం దేశావ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చేస్తోందని ప్రస్తావిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో పార్టీల ధీమా..

234 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో.. 128 మంది బలంతో భాజపా అధికారంలో కొనసాగుతోంది. గత ఫలితాల్లో తొలుత కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి  భాజపా వైపు వెళ్లిపోయారు. దాంతో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ నేతృత్వంలో కాషాయపార్టీ అధికారం చేపట్టింది. ఈసారి ఎన్నికల్లో సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హిందుత్వ ఓట్లను ఆకర్షించేందుకు సీఎం చౌహాన్‌ దేవాలయాలకు నిధులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే వాదన ఉంది. కాంగ్రెస్‌ మాత్రం తాము అధికారంలోకి వస్తే రూ.500లకే వంటగ్యాస్‌, 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం వంటి హామీలు గుప్పిస్తోంది. ఓబీసీలను ఆకట్టుకోవడంతోపాటు సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ నమ్ముకోగా.. అటు భాజపా మాత్రం కేంద్రంతోపాటు రాష్ట్రంలో చేస్తోన్న అభివృద్ధిని ప్రధానంగా ప్రచారం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని