INDIA Bloc: డీల్‌కు చేరువలో ఆప్‌-కాంగ్రెస్‌.. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పొత్తుకు రెడీ!

సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) సమయం దగ్గరపడుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య సీట్ల పంపిణీ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.

Published : 22 Feb 2024 21:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) సమయం దగ్గరపడుతోన్న వేళ.. విపక్ష కూటమిలో (INDIA) సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే యూపీలో కాంగ్రెస్‌-ఎస్పీ మధ్య ఒప్పందం కుదరగా.. తాజాగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య సీట్ల పంపిణీ చర్చలు తుది దశకు చేరినట్లు సమాచారం. దిల్లీతోపాటు హరియాణా, గుజరాత్‌, గోవాలలోనూ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

దిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే వీటిపై ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో గురువారం సాయంత్రం ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. రాజధాని దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలుండగా.. ప్రస్తుతం అవన్నీ భాజపా చేతిలో ఉన్నాయి. తాజా ఒప్పందంలో భాగంగా అధికార ఆప్‌ నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్‌కు మూడు స్థానాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, భాజపా అధికారంలో ఉన్న హరియాణా, గుజరాత్‌, గోవాల్లోనూ సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఆప్‌కు హరియాణాలో ఒకటి, గుజరాత్‌లో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి రెండు పార్టీలు త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే కేజ్రీవాల్‌ అరెస్ట్‌..: అతిషీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పూర్తయితే మూడు, నాలుగు రోజుల్లోనే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టు అవుతారని ఆప్‌ నేత, మంత్రి అతిషీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి తమ పార్టీ నేతలకు సందేశాలు వస్తున్నాయని అన్నారు. శనివారం లేదా ఆదివారం సీబీఐ నుంచి కేజ్రీవాల్‌కు నోటీసులు వస్తాయని, అనంతరం ఆయన అరెస్టు ఉంటుందన్నారు. కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఇండియా కూటమి నుంచి బయటకు రావడం ఒక్కటే మార్గమని సదరు సందేశాల సారాంశమని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని