Sam Pitroda: ‘సంపద స్వాధీనం’పై శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్‌

శామ్‌ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.

Published : 24 Apr 2024 10:59 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. భాజపా (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ మరణించిన వ్యక్తి ఆస్తిలోని 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తిరిగి పంపిణీ చేయాలని సూచించారు.

‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. అంటే మీరు సంపదను సృష్టించి, వదిలివెళ్లిపోతున్నారు. ప్రజల కోసం దానిని వదిలేయాలి. మొత్తం కాదు సగమే. అది నాకు న్యాయంగా అనిపిస్తోంది"  అని పిట్రోడా అన్నారు. ఈ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా..?అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త 55 శాతం సంపదకు, ఒకరైతు 55 శాతం సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. ‘‘గాంధీలు తమ పిల్లలు, అల్లుడి కోసం భారీ ఖజానాను నిర్మించారు. కానీ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును వారు లాక్కోవాలనుకుంటున్నారు" అని విమర్శించింది. పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ స్పందించింది. ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది.

ఇటీవల ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా?’’ అని ఓటర్లను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పిట్రోడా వ్యాఖ్యలు.. మోదీ చేసిన విమర్శలకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని