Unemployment:: నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్‌

‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది.

Published : 27 Mar 2024 15:34 IST

దిల్లీ: నిరుద్యోగంపై భారత ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని చెప్పడం విడ్డూరం అని పేర్కొంది. దేశంలో నిరుద్యోగ (Unemployment) సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వం ఆ సీటును ఖాళీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. యువతను మోసం చేసిందని ఆరోపించింది.

‘భారత ముఖ్య ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదు అని చెప్పడం భయంకరమైన విషయం’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. ఒకవేళ అది భాజపా ప్రభుత్వ అధికారిక వైఖరి అయితే.. ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని అడుగుతామన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్‌ వద్ద పక్కా ప్రణాళిక ఉందన్నారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని వెల్లడిస్తామన్నారు. దేశంలో పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. కోట్ల మంది నిరుద్యోగ యువతకు భరోసా కల్పించలేకపోయారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

గత రెండు దశాబ్దాల్లో దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిందని ‘ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్టు 2024’ పేరుతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో 83శాతం యువతేనని ఐఎల్‌ఓ, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డీ) చేసిన అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపింది. ఆ నివేదిక విడుదల సందర్భంగా భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ జోక్యంతో ప్రతీ సామాజిక, ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుందని భావించడం సరికాదన్నారు. నిరుద్యోగం వంటి సమస్యల విషయంలో పరిష్కారం కంటే సమస్యను గుర్తించడమే తేలికన్నారు. ఆయన వ్యాఖ్యలపైనే కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని