Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై మండిపడ్డ భాజపా

డీఏంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌  చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ మౌనంగా ఉండటంపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

Published : 06 Dec 2023 15:02 IST

దిల్లీ: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను వేరుగా చూస్తూ డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై (controversial remark) భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారంపై డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌, ఆ పార్టీ సీనియర్‌ నేతలు (సోనియా, రాహుల్‌ గాంధీలు) ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. ఎన్నికల్లో (Assmebly Elections) ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి బదులు భారతీయ సంస్కృతిని, గుర్తింపును అవమానించేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆరోపించింది. కాంగ్రెస్‌ అనుమతితోనే మిత్రపక్షం (DMK) ఈ వ్యాఖ్యలు చేసిందా? అని భాజపా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

డీఏంకే ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ ‘వసుధైక కుటుంబం’ అనే సందేశాన్ని ఇస్తుంటే.. ప్రతిపక్షం మాత్రం అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, ఈవీఎంలను నిందించడం, మూడు రాష్ట్రాల్లో ఓటమికి ప్రాంతీయతను కారణంగా చూపే పనిలో పడింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాంగ్రెస్‌ విశ్వసించదు. ఓటమి తర్వాత వాటికి గల కారణాలను వాళ్లు విశ్లేషించుకోరు. ఈవీఎంలపై ఆరోపణలు, హిందూ ధర్మం, దేశ సంస్కృతిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’ అని కాంగ్రెస్‌ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పార్ట్‌టైం జాబ్‌ మోసాలు.. 100కి పైగా వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

ఎన్నికల ప్రచారంలోనూ (Assmebly Elections) కుల, మత అంశాలను కాంగ్రెస్‌ నేతలు ప్రస్తావించారని.. అవి అక్కడ పనిచేయకపోవడంతో విభజన వాదానికి తెరతీశారని అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ఏ అవకాశాన్నీ వదులుకోదన్నారు. దేశ సంస్కృతిని అవమానించే డీఎంకేతో కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా దోస్తీ ఎందుకని ప్రశ్నించారు. దేశాన్ని ఉత్తర-దక్షిణాలుగా విభజించి చూసే ట్రెండ్‌ అమేఠీలో 2019లో రాహుల్‌ గాంధీ ఓటమి చెందినప్పటి నుంచే మొదలయ్యిందని దుయ్యబట్టారు.

ఎంపీ క్షమాపణలు..

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించగా..  తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ గెలుపొందింది. ఈ నేపథ్యంలో హిందీ రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణిస్తూ అక్కడ మాత్రమే కాషాయ దళం గెలువగలదని డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సెంథిల్‌ కుమార్‌ స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఓ అనుచిత పదాన్ని తాను ఉపయోగించానని, ఏ దురుద్దేశంతోనూ దాన్ని వాడలేదన్నారు. పార్లమెంటులోనూ క్షమాపణలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని