45 ఏళ్ల బ్యాచిలర్‌.. ఎన్నికల కోసం 45 గంటల్లో పెళ్లికూతురిని వెతుక్కుని..

Mamun Shah Khan: పదవి కోసం వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారో కాంగ్రెస్‌ నేత. అది కూడా 45 ఏళ్ల వయసులో..! మరి ఇన్నేళ్ల తర్వాత ఆయనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది..?

Published : 14 Apr 2023 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజలకు సేవ చేసేందుకు వివాహ బంధాన్ని కాదనుకుని 45 ఏళ్లుగా సింగిల్‌గా ఉంటున్న రాజకీయ నేత ఆయన. అలాంటిది ఇప్పుడు పదవి కోసం తప్పక పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో 45 గంటల్లో వధువును వెతికేసుకుని మరీ వివాహానికి సిద్ధమయ్యారు. ఈసీ (Election Commission) తీసుకున్న ఓ నిర్ణయమే అందుక్కారణం. మరి ‘రిజర్వేషన్‌’ చేస్తున్న ఈ పెళ్లి వెనుక కథంటో చూద్దామా..!

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని రాంపూర్‌ నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ (Congress) నేత ముమన్‌ షా ఖాన్‌ (Mamun Shah Khan).. గత మూడేళ్లుగా స్థానికంగా పార్టీలో మంచి ప్రాబల్యమున్న నాయకుడు. ప్రస్తుతం రాంపూర్‌ మున్సిపల్ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మున్సిపల్‌ కౌన్సిల్‌కు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి కూడా ముమన్‌ ఖాన్‌ పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడే రాష్ట్ర ఈసీ అసలు ట్విస్ట్‌ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించింది.

పెళ్లి వద్దనుకుని 45 ఏళ్ల పాటు బ్యాచిలర్‌గా ఉంటున్న ముమన్‌ ఖాన్‌ (Mamun Shah Khan)కు.. ఈసీ నిర్ణయంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పదవి కోసం తన సింగిల్‌ స్టేటస్‌ను మార్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన 45 గంటల్లోనే వధువును వెతికేసుకున్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు ఏప్రిల్‌ 17 చివరి రోజు కాగా.. ఏప్రిల్‌ 15న ముమన్‌ ఖాన్‌ పెళ్లి (Marriage) పీటలెక్కనున్నారు.

ఈ సందర్భంగా ముమన్‌ (Mamun Shah Khan) మాట్లాడుతూ.. ‘‘ఈసారి కూడా నేనే పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలు కోరారు. అయితే.. ఈసీ నిర్ణయంతో నేను పెళ్లికి సిద్ధమయ్యాను. ఏప్రిల్‌ 15న నేను పెళ్లి చేసుకుంటున్నా. నా భార్య తప్పకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రజలకు సేవ చేయాలనే నా తపన అంతా’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని