LS polls: ‘జమ్మూలో.. ఇన్నేళ్లు రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదు’ - మోదీ

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై (Congress Manifesto) భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 07 Apr 2024 15:02 IST

నవాడ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై (Congress Manifesto) భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో మాదిరిగానే ఉందని, బుజ్జగింపు రాజకీయాల కోసమే దాన్ని రూపొందించినట్లుగా కనిపించిందన్నారు. బిహార్‌లోని నవాడ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ.. ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఇన్నేళ్లు రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

‘‘కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు చిన్న పదవిలో లేరు. ఆర్టికల్‌ 370కి రాజస్థాన్‌కు ఏం సంబంధమని ఆయన అన్నారు. ఇదీ ‘తుక్‌డే-తుక్‌డే’ గ్యాంగ్‌ మనస్తత్వం. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన బిహార్‌, రాజస్థాన్‌లకు చెందిన భద్రతా సిబ్బందిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన కాంగ్రెస్‌తోపాటు దాని మిత్రపక్షాలు రాజ్యాంగం గురించి మాట్లాడేందుకు ఈమధ్య చాలా ఉత్సాహం చూపుతున్నాయి. మరి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదు? అది మోదీ హయాంలోనే సాధ్యమైంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా త్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్‌ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల హామీలు ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో మాదిరిగా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. అందులో బుజ్జగింపు రాజకీయాలే కనిపించాయన్నారు. ఇక అత్యంత ప్రజాదరణ కార్యక్రమాలపై కాంగ్రెస్‌కు ఎందుకంత కోపమో తెలియదన్న మోదీ.. ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికీ హాజరుకాలేదన్నారు. రామనవమి సమీపిస్తోందని.. వారి పాపాలను మరచిపోవద్దంటూ బిహార్‌ ఓటర్లకు ప్రధాని మోదీ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని