Katchatheevu: మోదీజీ.. కచ్చతీవును వెనక్కి తీసుకురాగలరా..?: కాంగ్రెస్ నేత సవాల్‌

తమిళ (Tamil Nadu) ప్రజల నుంచి తిరస్కరణను ఎదుర్కొంటోన్న భాజపా దారి మళ్లించే వ్యూహాలు అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ విమర్శించారు. 

Published : 01 Apr 2024 14:08 IST

చెన్నై: ఎన్నికల నేపథ్యంలోనే కచ్చతీవు అంశాన్ని ప్రధాని మోదీ (Modi) రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శించింది. తమిళనాడు (Tamil Nadu)పై ఆయనకు అంత శ్రద్దే ఉంటే శ్రీలంక నుంచి దానిని వెనక్కి తీసుకురావాలని ఆ పార్టీ నేత మాణికం ఠాగూర్ సవాల్‌ విసిరారు.

‘‘ప్రధానికి సవాల్‌ విసురుతున్నాను. తమిళనాడు గురించి అంత పట్టింపు ఉంటే.. కచ్చతీవును వెనక్కి తీసుకువస్తారా..? పది సంవత్సరాల కాలంలో ఈ విషయంలో మోదీ విఫలమయ్యారు. ఈ రాష్ట్ర ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన భాజపా.. ఇలా దారి మళ్లించే వ్యూహాలు ప్రయోగిస్తోంది’’ అని మాణికం ఠాగూర్ విమర్శించారు.

ఎన్నికలముందు ‘కచ్చతీవు’ రగడ.. జై శంకర్ ఏమన్నారంటే..?

1974లో కచ్చతీవును ఇందిర ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందంటూ తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై సమాచారహక్కు చట్టం ప్రకారం సేకరించిన సమాచారం ఆధారంగా ఓ పత్రిక రాసిన కథనాన్ని మోదీ ‘ఎక్స్‌’లో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే దానిపై రాజకీయ రగడ మొదలైంది.

ప్రధాని ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే ఈ సున్నిత అంశాన్ని ప్రధాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కచ్చతీవును వెనక్కి తెచ్చుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని