S Jaishankar: ఎన్నికలముందు ‘కచ్చతీవు’ రగడ.. జై శంకర్ ఏమన్నారంటే..?

కచ్చతీవు అంశంపై కేంద్రం, తమిళనాడు మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) అన్నారు. 

Updated : 01 Apr 2024 11:03 IST

దిల్లీ: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ‘కచ్చతీవు’ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై తాజాగా విదేశాంగమంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు.

‘‘ఇది ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు. దీనిపై పార్లమెంట్‌లో, అలాగే కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చాను. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారు. మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దృష్టిలో ఇది చిన్న ద్వీపం. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి.. వదిలించుకోవాలనుకున్నారు. ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 

అలాగే కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆ ద్వీపాన్ని అప్పగించేటప్పుడు తమను సంప్రదించలేదని డీఎంకే చెప్పింది. వాస్తవమేంటంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా.. ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సి ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి’’ అని వెల్లడించారు. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు.

కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?

ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు కచ్చతీవు మన దగ్గరే ఉంది. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి భద్రతా పరంగా కీలకమైంది. కానీ కాంగ్రెస్‌ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకూ పనికిరాదంటూ శ్రీలంకకు ఇచ్చేసింది. ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నాం. తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్లినపుడు లంక అధికారులు అరెస్టు చేస్తున్నారు. బోట్లను జప్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకట్టిన డీఎంకే లాంటి పార్టీలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు’’ అని మోదీ పేర్కొన్నారు.

ఇదే అంశంపై తాజాగా ప్రధాని మోదీ ఎక్స్‌( ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే.. కుటుంబ పార్టీలు. ఆ నేతలు వారి వారసుల ఎదుగుదల గురించి మాత్రమే పట్టించుకున్నారు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్యంతో పేద మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లింది. కొత్తగా వెలుగులోకి వస్తోన్న విషయాలు డీఎంకే ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి’’ అని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని