Pune Porsche accident: పోర్షే కార్‌ యాక్సిడెంట్‌.. ‘వ్యాస రచన పోటీ’తో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

Pune Porsche accident: పోర్షే ప్రమాద ఘటనలో అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

Updated : 27 May 2024 17:43 IST

Pune Porsche accident | ముంబయి: మహారాష్ట్రలోని పుణెలో జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన బాలుడి వ్యవహారం గురించి చర్చించుకుంటోంది. ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి తండ్రి ఓ ప్రముఖ బిల్డర్‌ కావడంతో పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో వ్యాస రచన పోటీని నిర్వహించింది. ‘ఒకవేళ మా నాన్న బిల్డర్‌ అయితే?’, ‘ఆల్కహాల్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు’ ‘అధికార వ్యవస్థ నిద్ర పోతోందా?’ వంటి అంశాలపై వ్యాస రచన పోటీ ఏర్పాటు చేసింది. ఆదివారం నిర్వహించిన ఈ పోటీకి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆకట్టుకునేలా వ్యాసం రాసిన వారికి రూ.11వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు చొప్పున బహుమతులు కూడా ప్రదానం చేశారు. వీటిని హోంమంత్రితో పాటు, పుణె పోలీసు కమిషనర్‌కు పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు.

మే 19న జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కేవలం 15 గంటల్లోనే బాలుడికి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ మంజూరుచేసిన తీరును నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ ఈ రూపంలో నిరసన తెలియజేసింది. బెయిల్‌ మంజూరు విషయంలో న్యాయ సహజ సూత్రాలను అపహాస్యం చేసేలా జువైనల్‌ బోర్డు వ్యవహరించిందని ఆరోపించింది. రేప్పొద్దున ఎవరైనా యాక్సిడెంట్‌ చేస్తే వారి కుటుంబ సంబంధాలను దృష్టిలోపెట్టుకుని ఇలానే 300 పదాలు, 600 పదాల వ్యాసం రాయిస్తారా? అని పుణె కాంగ్రెస్‌ నేత సంగీత తివారీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్లు తెరవాలన్న ఉద్దేశంతో ఈ వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న పబ్‌లు, రెస్టరంట్లపై చర్యలు తీసుకోవాలని యూత్‌ వింగ్‌ డిమాండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు