Modi: వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు

వారసత్వ పన్ను గురించి శామ్‌ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. 

Published : 24 Apr 2024 13:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్‌ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఈ వ్యాఖ్యలపై స్పందించారు. చనిపోయిన వ్యక్తుల ఆస్తుల్నీ కాంగ్రెస్‌ దోచుకుంటుందని తీవ్రంగా విమర్శించారు.

‘‘మధ్య తరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంత కాలం క్రితం యువరాజు, రాజ కుటుంబం సలహాదారు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని చెప్తోంది. మీరు చెమటోడ్చి కూడబెట్టిన సంపద.. మీ పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి సొమ్మును దోచుకోవడం ఒక్కటే కాంగ్రెస్ సూత్రంలా ఉంది’’ అని మోదీ ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ పార్టీ.. వారి పూర్వీకుల ఆస్తి అని ఆ వ్యక్తులు (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తున్నారు. దానిని వారి పిల్లలకు అందించారు. కానీ భారతీయులు తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడట్లేదు’’ అని దుయ్యబట్టారు.

‘సంపద స్వాధీనం’పై శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్‌

దీనికిముందు పిట్రోడా మాట్లాడుతూ..‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది’’ అని అన్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో హస్తం పార్టీ స్పందించింది. అదంతా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని