NMML: నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం పేరు మార్పు.. మండిపడ్డ కాంగ్రెస్‌

నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ (NMML) పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ (Prime Ministers' Museum and Library Society) కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Updated : 16 Jun 2023 16:49 IST

దిల్లీ: భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) అధికారిక నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్‌ తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. అందులో ఉన్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ (NMML) పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ (Prime Ministers' Museum and Library Society) కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి ఉపాధ్యక్షుడిగా ఉన్న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మ్యూజియం పేరును మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. నెహ్రూ పేరుతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మ్యూజియం పేరును మార్చడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘జవహార్‌లాల్‌ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుంది. అందుకే దీని పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదన స్వాగతించదగినది’ అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రులు అంటే ఓ సంస్థ అని అభివర్ణించిన ఆయన.. అందరు ప్రధానుల ప్రయాణాన్ని ఇంద్రధనస్సుతో పోల్చారు. ఇది అందంగా ఉండాలంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సమపాళ్లలో ఉండాలని అభిప్రాయపడ్డారు.

మండిపడ్డ కాంగ్రెస్‌..

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయంపై మండిపడింది. ఇది వారి అల్పబుద్ధి, నిరంకుశ మనస్తత్వాన్ని తెలియజేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎటువంటి చరిత్ర లేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారని అన్నారు. 59ఏళ్లకు పైగా అంతర్జాతీయ మేధో భాండాగారంగా విరాజిల్లుతోన్న, ఎన్నో విలువైన పుస్తకాలకు నిలయంగా ఉన్న ఈ మ్యూజియం పేరు మార్చడం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. సంకుచిత మనస్తత్వం, ప్రతీకారానికి మోదీ మారుపేరుగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు. అభద్రతాభావంతో ఉండే ఓ అల్పవ్యక్తి విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని